పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాజ్యసభలో నోట్ల కట్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. డిసెంబర్ 6న కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ సీటు దగ్గర కరెన్సీ నోట్ల ప్రత్యక్షమయ్యాయి. ఆ సమయంలో తీవ్ర అలజడి చెలరేగింది. అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర ఆరోపణలు జరిగాయి. సెక్యూరిటీ వైఫల్యం విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఇదే అంశంపై రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ స్పందించారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రాజ్యసభలో దొరికిన నోట్ల కట్ల వ్యవహారం తనను ఎంతగానో బాధించిందని తెలిపారు. ఎవరూ కూడా క్లెయిమ్ చేయకపోవడం మరింత బాధించిందని పేర్కొ్న్నారు. నైతిక ప్రమాణాలకు ఇది సవాల్ విసురుతోందన్నారు.
రాజ్యసభలో అనేక ఏళ్లుగా నైతిక విలువల కమిటీ లేదని ధన్‌ఖడ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. 1990 చివరిలో మాత్రమే రాజ్యసభలో తొలిసారి ఈ కమిటీ ఏర్పాటు అయిందని తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్‌గా ఒక విషయం మాత్రం చెప్పగలనని… సభలో ఉన్నవారు గొప్ప అర్హతలు, అనుభవం కలిగి ఉన్నవారేనన్నారు. కానీ సభ కార్యకలాపాల విషయానికి వస్తే.. వేరేవారి మార్గనిర్దేశంలో నడచుకుంటారని విచారం వ్యక్తం చేశారు.
డిసెంబర్ 6న రాజ్యసభలో జరిగిన నోట్ల వ్యవహారంపై కాంగ్రెస్ సమాధానం చెప్పాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ధన్‌ఖడ్ ప్రకటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తు పూర్తికాకముందే సభ్యుడి పేరు బయటకు చెప్పడమేంటని నిలదీశారు. అయితే తాను సభకు నోట్ల కట్టను తీసుకురాలేదని సింఘ్వీ స్పష్టం చేశారు. తన సీటు దగ్గర కరెన్సీ నోట్లు దొరకడం భద్రతా వైఫల్యమేనన్నారు. సభలో ప్రతి సీటు చుట్టూ గాజు గదినిగానీ, ముళ్లతో కూడిన ఇనుప కంచెనుగానీ ఏర్పాటు చేయాలని సూచించారు.