దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గామ్ ఉగ్ర దాడిపై ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సూత్రధారిగా లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌ను నిందితుడిగా చేర్చింది. అంతేకాకుండా పాకిస్థాన్ కుట్రపై కూడా కీలక విషయాలు వెల్లడించింది.
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఘోర ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ దాడి వెనుక సూత్రధారిగా నిషేధిత లష్కరే తోయిబా (LeT) చీఫ్ హఫీజ్ సయీద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) తన తాజా అనుబంధ చార్జ్‌షీట్‌లో నిందితుడిగా పేర్కొంది. ఈ దాడి పాకిస్థాన్ భూభాగం నుంచి పన్నిన ఉగ్ర కుట్రలో భాగమని, హఫీజ్ సయీద్ కీలక పాత్ర పోషించినట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. జమ్మూలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో పాకిస్థాన్ ప్రమేయం, హఫీజ్ సయీద్ పాత్ర, దర్యాప్తులో సేకరించిన శాస్త్రీయ ఆధారాలు, ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్ వివరాలను పొందుపరిచింది. గతంలో దాఖలు చేసిన 1,597 పేజీల చార్జ్‌షీట్‌కు ఇది కొనసాగింపుగా ఎన్‌ఐఏ తెలిపింది.
హఫీజ్ సయీద్‌ను వ్యక్తిగత హోదాలోనే కాకుండా.. నిషేధిత లష్కరే తోయిబా అధినేతగా.. దాని అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) అధిపతిగా కూడా ఎన్‌ఐఏ అభియోగాలు మోపింది. భారతీయ న్యాయ సంహిత (BNS)-2023, అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)-1967 కింద కేసులు నమోదు చేసింది. భారతదేశంపై యుద్ధం చేయడానికి కుట్ర పన్నడం, పాకిస్థాన్ నుంచి ఉగ్రదాడికి ప్రణాళిక రూపొందించడం వంటి ఆరోపణలను చార్జ్‌షీట్‌లో చేర్చింది.
2025 ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం పహల్గామ్ సమీపంలోని బైసరన్ మైదానంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు కలిపి మొత్తం 26 మంది మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీయగా అనంతరం భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సైనిక దాడులు నిర్వహించింది. ఈ ఘటలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్థాన్ సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయి. మొదట పహల్గామ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, అనంతరం కేంద్ర హోంశాఖ దర్యాప్తును ఎన్‌ఐఏకు అప్పగించింది.
2025 డిసెంబర్ 15న ఎన్‌ఐఏ దాఖలు చేసిన తొలి చార్జ్‌షీట్‌లో పాకిస్థాన్‌కు చెందిన హ్యాండ్లర్ సాజిద్ జట్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంది. అలాగే ఆపరేషన్ మహాదేవ్ సందర్భంగా హతమైన ముగ్గురు ఉగ్రవాదులతో పాటు అరెస్టైన ఇద్దరు నిందితులను కూడా చార్జ్‌షీట్‌లో చేర్చింది. లష్కరే తోయిబా, దాని అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ఈ దాడికి ప్రణాళిక రూపొందించడం, అమలు చేయడం, సహకరించడం వంటి చర్యలకు బాధ్యత వహించాయని ఎన్‌ఐఏ పేర్కొంది.
దాడికి నెలల ముందుగానే ఉగ్రవాదులు కశ్మీర్‌లోని పర్వత ప్రాంతాలు, జనావాసాల్లో ఎలాంటి అనుమానం రాకుండా సంచరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. సాంప్రదాయ చొరబాట్లకంటే భిన్నంగా, డ్రోన్ల ద్వారా ఆయుధాలు, నగదు, పేలుడు పదార్థాలను అందించినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. 2024 ప్రారంభంలో బారాముల్లా జిల్లాలోని గోగల్ దారా అటవీ ప్రాంతంలో డ్రోన్ ద్వారా 20 పిస్టళ్లు, రూ.15 లక్షల నగదు, చైనా తయారీ త్రిభుజాకార గ్రెనేడ్లను ఉగ్రవాద మాడ్యూల్‌కు చేరవేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. డ్రోన్ల వినియోగం ద్వారా సరిహద్దు నిఘాను తప్పించుకుని లోతట్టు ప్రాంతాల్లోనే ఉగ్రవాదులకు ఆయుధాలు అందించడం ఉగ్రవాద వ్యూహంలో కీలక మార్పుగా ఎన్‌ఐఏ పేర్కొంది.
ఈ దర్యాప్తులో భద్రతా వ్యవస్థలో కొన్ని బలహీనతలు కూడా బయటపడ్డాయి. 2022 నుంచి 2024 మధ్య కశ్మీర్‌లో మానవ నిఘా వ్యవస్థ బలహీనపడడంతో ఉగ్రవాదులు గుర్తించకుండా సంచరించగలిగినట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. సాంకేతిక నిఘాపై అధికంగా ఆధారపడటం వల్ల స్థానిక సమాచార సేకరణ తగ్గిందని, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో మానవ నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నివేదికలు సూచించాయి.
దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది
పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్న పూర్తి కుట్రను ఛేదించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. ‘‘భారత భూభాగంలో సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ కుట్రను పూర్తిగా వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కుట్రలో భాగమైన ప్రణాళికకర్తలు, హ్యాండ్లర్లు, సహాయకులు, లాజిస్టిక్ నెట్‌వర్క్‌ను గుర్తించే పనిలో దర్యాప్తు కొనసాగుతోంది.’’ అని ఎన్‌ఐఏ వెల్లడించింది.

