NTV Telugu Site icon

Orissa High Court: అలా చేయడం అత్యాచారం కిందకు రాదు.. ఒరిస్సా హైకోర్టు సంచలన తీర్పు

Orissa High Court

Orissa High Court

Orissa High Court Gives Shocking Judgement In Woman Assault Case: సోమవారం ఒరిస్సా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొంటే.. అది అత్యాచారం కిందకు ఏమాత్రం రాదని స్పష్టం చేసింది. ఒక అత్యాచారం కేసు విచారణలో భాగంగా.. హైకోర్టు ఈ మేరకు జడ్జ్‌మెంట్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. భువనేశ్వర్‌కి 40 కిలోమీటర్ల దూరంలోని నిమపారకు చెందిన ఒక వ్యక్తి.. ప్రేమ పేరుతో ఒక మహిళ వెంటపడ్డాడు. నువ్వు లేకుండా ఉండలేనని, పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించాడు. అతని మాటల్ని నమ్మి, ఆ మహిళ కూడా అతడ్ని ప్రేమించింది. పెళ్లి పేరుతో భువనేశ్వర్ తీసుకెళ్లి, అక్కడ కొన్ని రోజుల పాటు ఆమెతో సహజీవనం చేశాడు. ఈ క్రమంలో ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతీసారి.. అదిగో అప్పుడు, ఇదిగో ఇప్పుడు అంటూ మాట దాటవేస్తూ వచ్చాడు. చివరికి ఒక రోజు ఉన్నట్టుండి ఆమెని వదిలి పారిపోయాడు.

Delhi Car Horror: మృతురాలు అంజలి ఇంట్లో దోపిడీ.. చేసింది ఫ్రెండ్ నిధినే!

దీంతో.. ఆ మహిళ అతనిపై కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనపై అత్యాచారానికి పాల్పడ్డానని తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. అతని ఆచూకీ కనుగొని అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం అతడు జిల్లా కోర్టులో దరఖాస్తు చేసుకోగా.. న్యాయస్థానం అందుకు నిరాకరించింది. దాంతో అతడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. వాదనలు విన్న తర్వాత నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అతడు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చినప్పటికీ.. ఇద్దరు పరస్పర అంగీకారంతోనే సహజీవనం చేశారు కాబట్టి, దీనిని అత్యాచారంగా పరిగణించలేమని హైకోర్టు పేర్కొంది. మరోవైపు.. తనపై కేసు పెట్టినందుకు మహిళను బెదిరించే పనులకు పాల్పడకూడదని నిందితుడ్ని కోర్టు హెచ్చరించింది. కేసు విచారణకు పూర్తిగా సహకరించాలని అతనికి ఆదేశాలు జారీ చేసింది.

Supreme Court: మతమార్పిడి తీవ్రమైన సమస్య.. దీన్ని రాజకీయం చేయొద్దు