రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే కాగా… ఈ ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి, యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు.. పలు సమార్లు సమావేశమైన విపక్షాలు చాలా మంది అభ్యర్థుల పేర్లను పరిశీలించినా.. చివరకు ఏకాభిప్రాయంతో అనుభవం ఉన్న యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. దీంతో, ఇవాళ ఉదయం 11.30 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. జులై 18న జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి ప్రతిపక్షం నుంచి ఏకాభిప్రాయ అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి సిన్హా ఎంపికయ్యారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
సమర్ధుడైన అడ్మినిస్ట్రేటర్‌గా, నిష్ణాతుడైన పార్లమెంటేరియన్‌గా, కేంద్ర మంత్రిగా వివిధ హోదాల్లో దేశానికి సేవలందించారు. ఆర్థిక మరియు విదేశీ వ్యవహారాల వంటి కీలక శాఖలను కూడా ఆయన నిర్వహించారు. ఇక, ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్ష ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా ప్రధాన పోటీదారులు కాగా, ఇప్పటి వరకు కనీసం 30 మంది తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇందులో ముంబైకి చెందిన ఒక మురికివాడ నివాసి, ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ యాదవ్, తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త మరియు ఢిల్లీకి చెందిన ఒక ప్రొఫెసర్ ఉన్నారు. కాగా, విపక్షాల అభ్యర్థిగా శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, మహాత్మా గాంధీ మనవడు గోపాల్ కృష్ణ గాంధీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించడంతో సిన్హా పేరు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. జూన్ 21న ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా సిన్హా పేరును ప్రకటించారు. బీజేపీ మాజీ నేత అయిన యశ్వంత్ సిన్హా గత వారం మద్దతు కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను కూడా సంప్రదించారు. ఇక, ఇవాళ జరగనున్న నామినేషన్ దాఖలు కార్యక్రమానికి పలు పార్టీల నేతలతో పాటు టీఆర్ఎస్ బృందం కూడా పాల్గొనబోతోంది.. ఇందుకోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఢిల్లీ చేరుకున్నారు.. కేటీఆర్‌తో పాటు టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, సురేశ్ రెడ్డి, బీబీ పాటిల్, వెంకటేశ్ నేత, కొత్త ప్రభాకర్ రెడ్డి తదితరలు పాల్గొనబోతున్నారు.