దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్‌లో వేడుకలు అంబరాన్నంటాయి. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని మోడీ, యూరోపియన్ నాయకులు, కేంద్రమంత్రులు, వీఐపీలు హాజరయ్యారు.
ఇక ఈ సందర్భంగా జరిగిన కవాతు ప్రేక్షకులను ఆకట్టుకుంది. పరేడ్‌లో ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన శకటం కనువిందు చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలతోనే ఆపరేషన్ సిందూర్ నిర్వహించినట్లుగా శకటం ద్వారా నిరూపితం చేశారు. యుద్ధంలో ప్రయోగించిన ఆయుధాలను, నిఘా వ్యవస్థలు, బలగాలు ఈ శకటంలో కనిపించాయి. త్రివిధ దళాల సమన్వయంతో భారత్ శక్తి ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రదర్శింపబడిందని శకటం రూపంలో కనువిందు చేసింది.
ఏప్రిల్ 22, 2025న పహల్గామ్‌లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. మతం పేరుతో 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. దీంతో భారతదేశం ప్రతీకారంగా పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి. నాలుగు రోజుల యుద్ధం తర్వాత ఇరు దేశాల చర్చల తర్వాత కాల్పుల విరమణ జరిగింది.
