Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..

  • పాకిస్తాన్ చర్చలకు వచ్చినా దాడులు చేశాము..
  • ఆపరేషన్ సిందూర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీడీఎస్..
Ex Cds

Ex Cds

Operation Sindoor:  ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ చర్చలు జరపాలని భారత్‌ను సంప్రదించినా దాడులు చేసినట్లు మాజీ CDS జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఉదయం సుమారు 10 గంటల సమయంలో చర్చల కోసం ఫోన్ చేసిందని, ఆ సమయంలో భారత వైమానిక దళం చీఫ్ సర్గోధాపై దాడి చేయాలా అని తనను అడిగార, అందుకు తాను ‘‘గో ఎహెడ్’’ అని అనుమతి ఇచ్చారని వెల్లడించారు. ఇదే కాకుండా మరో రెండు టార్గెట్లను గుర్తించాలని కోరినట్లు తెలిపారు. వాటిలో ఒకటి పీఓకేలోని స్కార్దుపై దాడికి కూడా అనుమతించినట్లు చెప్పారు. వాతావారణ బాగా లేకపోవడం వల్ల ఆ దాడిని భోలారికి మార్చాల్సి వచ్చిందన్నారు.

ఆపరేషన్ సిందూర్‌లో భారత్ రూపొందించుకున్న ఎస్కలేషన్ మ్యాట్రిక్స్లో కీలక సూత్రం ఉందని చౌహాన్ చెప్పారు. చివరి దాడి లేదా విజయాన్ని నిర్ణయించే దాడి ఎప్పుడూ మన నుంచే ఉండాలని, పాకిస్తాన్ నుంచి కాదని ఇదే తమ వ్యూహంలో ముఖ్య సూత్రమని చెప్పారు. ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగితే, వాటికి అనుగుణంగా తదుపరి దశలకు వెళ్లేలా భారత సైన్యం ముందుగానే వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు.

ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం తక్కువ ఎత్తులో ఉన్న గగనతలాన్ని వినియోగించడాన్ని ప్రత్యేక వ్యూహంగా ఎంచుకుందని చౌహాన్ చెప్పారు. ఉరీ ఉగ్రదాడి తర్వాత భారత్ గ్రౌండ్ ఆపరేషన్ చేసిందని, పుల్వామా తర్వాత పెద్ద స్థాయి వైమానిక దాడులు జరిగాయని గుర్తు చేసిన ఆయన, ఆపరేషన్ సిందూర్‌ సమయంలో మూడో మార్గంగా తక్కువ ఎత్తులోని గగనతలాన్ని వినియోగించినట్లు వివరించారు. దీని వల్ల సంఘర్షణ స్థాయిని నియంత్రణలో ఉంచడంతో పాటు విజయావకాశాలను పెంచి ప్రత్యర్థికి షాక్ కలిగించవచ్చని తెలిపారు.

ఆపరేషన్ సిందూర్‌లో భారత్ విజయానికి మెరుగైన సిట్యుయేషనల్ అవేర్‌నెస్, బ్యాటిల్‌ఫీల్డ్ ట్రాన్స్‌పరెన్సీ, మూడు దళాల మధ్య మెరుగైన నెట్‌వర్కింగ్ ప్రధాన కారణాలని చౌహాన్ తెలిపారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మూడు దళాలకు ఒకే విధమైన కామన్ ఆపరేషన్ పిక్చర్ అందుబాటులో ఉండటంతో మెరుగైన నిర్ణయాలు తీసుకోగలిగామని చెప్పారు. రాజకీయ నాయకత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడం కూడా కీలకమైందని, దీంతో ఆపరేషన్ ప్రణాళిక చేసుకునేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ లభించిందని తెలిపారు.