Site icon NTV Telugu

Supreme Court: “అత్తమామాలపై ప్రతీకారం కోసమే”.. వరకట్న వేధింపుల కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు..

Supreme Court

Supreme Court

Supreme Court: అత్తమామాలపై ఒక మహిళ దాఖలు చేసిన వరకట్న వేధింపుల కేసును సుప్రీంకోర్టు రద్దు చేసింది. సదరు మహిళ తన అత్తామమాలపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఇలా చేసిందని వ్యాఖ్యానించింది. మహిళ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ని కొనసాగించడం అన్యాయానికి దారి తీస్తుందని పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, సంజయ్ కుమార్, ఎస్‌విఎన్ భట్టిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

వాస్తవాలను, పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే సదరు మహిళ ఆమె అత్తామామలపై చేసిన ఆరోపణలు సరిపోవని ధర్మాసనం చెప్పింది. సదరు మహిళ స్పష్టంగా తన అత్తామామలపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటోంది.. ఆమె ఆరోపణలు పూర్తిగా విచిత్రమైనవి, అసంభవమైనవిగా పేర్కొంది. మహిళ తన అత్తామామలు, బావపై విచారణ రద్దు చేసేందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు నిరాకరించిన సమయంలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది.

Read Also: Udhayanidhi Stalin: “మోదీ కాంగ్రెస్ ముక్త్ భారత్ పిలుపునిచ్చినప్పుడు”.. సనాతన వ్యాఖ్యలపై ఉదయనిధి

కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన సదరు మహిళ 2007లో వివాహం చేసుకుంది. అయితే ఆమె భర్త వివాహాన్ని రద్దు చేయాలని విడాకులకు అప్లై చేశాడు. భర్త విడాకుల పిటిషన్ దాఖలు చేయడానికి ముందు మహిళ తన భర్త, అత్తామామలపై అనేక ఆరోపణలు చేస్తూ పోలీసుకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 498A (ఒక మహిళను క్రూరత్వానికి గురిచేసిన భర్త లేదా భర్త బంధువు) మరియు వరకట్న నిషేధ చట్టం, 1961లోని సెక్షన్లు 3 మరియు 4 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ కేసును విచారించిన సుప్రీం.. వేర్వేరు నగరాల్లో నివసించే ఆమె బావ, అత్తమామాలు ఆమెను ఎలా కట్నం కోసం వేధించారని ప్రశ్నించింది. ఆమె ఆరోపణలు అసంబద్ధమైనవిగా ఉన్నాయని పేర్కొంది. ఫిబ్రవరి 2009లో తన అత్తగారి ఇళ్లును వదిలిపెట్టిన మహిళ, ఆమె భర్త విడాకులకు ప్రక్రియను ప్రారంభించే ముందు 2013లో ఫిర్యాదు చేయడాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. దీంతో ఆమె దాఖలు చేసిన వరకట్న వేధింపుల కేసును కొట్టేసింది.

Exit mobile version