One Vote Victory: ఒక్క ఓటుతో గెలుపు.. తిరుపత్తూరులో టీవీకే అభ్యర్థి సంచలన విజయం!

One Vote Victory

One Vote Victory

One Vote Victory: ఎన్నికల ఫలితాల్లో ప్రతి ఓటూ విలువైందే అని చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. తిరుపత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన హోరాహోరీ పోరులో తమిళగ వెట్రి కళగం (TVK) అభ్యర్థి శ్రీనివాస సేతుపతి అద్భుత విజయాన్ని అందుకున్నారు. అధికార డీఎంకే (DMK) అభ్యర్థి, సీనియర్ నేత పెరియకరుప్పన్‌పై ఆయన కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపొంది సంచలనం సృష్టించారు.

నరాలు తెగే ఉత్కంఠ
కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఇద్దరు అభ్యర్థుల మధ్య ఓట్ల ఆధిక్యం దోబూచులాడింది. చివరి రౌండ్ ముగిసేసరికి ఇద్దరి మధ్య తేడా అత్యల్పంగా ఉండటంతో అధికారులు రీ-కౌంటింగ్ నిర్వహించారు. తుది ఫలితంలో శ్రీనివాస సేతుపతికి ఒక్క ఓటు ఆధిక్యం లభించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పెరియకరుప్పన్ (DMK)పై 01 ఓటు మెజార్టీతో శ్రీనివాస సేతుపతి (TVK) విజేతగా నిలిచినట్లు అధికారులు తెలిపారు. ఒక సామాన్య ఓటరు వేసే ఓటు ప్రజాస్వామ్యంలో ఎంతటి కీలక మార్పును తీసుకురాగలదో ఈ ఫలితం నిరూపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం ఒక్క ఓటు తేడాతో తమ అభ్యర్థి గెలవడంతో టీవీకే కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. “ఒక్క ఓటు కదా అని నిర్లక్ష్యం చేయకూడదని, ఆ ఒక్క ఓటే ఇప్పుడు చరిత్ర సృష్టించిందని” వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అతి తక్కువ తేడాతో ఓటమి పాలవ్వడంపై డీఎంకే శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

నిజానికి తమిళనాడు ఎన్నికల ఫలితాలు యావత్ దేశాన్ని ఆశ్చర్యానికిలోను చేశాయి. వాస్తవానికి అన్నీ ఎగ్జిట్‌పోల్స్ గుంప్పగుత్తగా అధికార డీఎంకే మళ్లీ తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందని చెప్పగా, యాక్సిస్ మై ఇండియా మాత్రం టీవీకేకి పట్టం గట్టింది. మే 4న వెలువడిన ఫలితాలు అన్ని ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను తలక్రిందులు చేస్తూ టీవీకేకు జనాలు నిరాజనాలు పలికారు. ప్రస్తుతం తమిళనాడులో విజయ్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. నిజానికి ఈ ఎన్నికల్లో అనూహ్యమైన ఓటములను సంభవించి యావత్ దేశం ఆశ్చర్యపోయేలా చేసిన స్థానం సీఎం స్టాలిన్ పోటీ చేసిన కొళత్తురు. డీఎంకేకి కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి పోటీ చేసిన సీఎం ఓడిపోయారు. ఇదే సమయంలో టీవీకే అధినేత విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల నుంచి విజయాన్ని అందుకున్నారు. ఈ దఫా తమిళనాడులో జరిగిన ఎన్నికలు ఆ రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.