ముంబైలో ఫెర్రీ బోటు ప్రమాదం మరువక ముందే గోవాలో మరో ప్రమాదం జరిగింది. గోవాలోని కలాంగుట్ బీచ్‌లో టూరిస్ట్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. 20 మందిని రక్షించారు. ప్రమాదంలో 54 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రయాణికుల పడవ బోల్తా పడిందని.. ఒకరు చనిపోగా.. 20 మందిని రక్షించి ఆస్పత్రికి తరలించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.
ఇద్దరు ప్రయాణికులు మినహా మిగతా వారంతా లైఫ్ జాకెట్లు ధరించారని అధికారులు తెలిపారు. ప్రయాణికుల్లో ఆరేళ్లలోపు పిల్లలు, మహిళలు కూడా ఉన్నారని తెలిపారు. తీరప్రాంతానికి 60 మీటర్ల దూరంలో పడవ బోల్తా పడిందని, దీంతో ప్రయాణికులంతా సముద్రపు నీటిలో పడిపోయారని ప్రభుత్వం నియమించిన లైఫ్‌సేవింగ్ ఏజెన్సీ మెరైన్ ప్రతినిధి తెలిపారు. గాయపడిన ప్రయాణికులకు ప్రథమ చికిత్స అందించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు గుర్తించిన వారిని అంబులెన్స్‌లో వైద్య సదుపాయానికి తరలించినట్లు ప్రతినిధి తెలిపారు. 20 మంది ప్రయాణీకుల్లో ఆరు మరియు ఏడు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలాగే 25 మరియు 55 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మహిళలు ఉన్నారు. పడవలో ఇద్దరు ప్రయాణికులు లైఫ్ జాకెట్లు ధరించలేదని ఆయన చెప్పారు
ఇటీవల ముంబై తీరంలో ఫెర్రీని స్పీడ్ బోటు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది వరకు చనిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల సాయం ప్రకటించింది.