Devendra Fadnavis: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని శివసేన ఠాక్రే, ఎన్సీపీ శరద్ పవార్ కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’’ దారుణంగా ఓడిపోయింది. 288 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ కూటమి కేవలం 46 స్థానాలు మాత్రమే గెలిచింది. మరోవైపు బీజేపీ కూటమి మహాయుతి ఏకంగా 233 స్థానాలను కైవసం చేసుకుని మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. 132 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ నిలిచింది. అయితే, ఈ ఓటమి తర్వాత నుంచి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఈవీఎంలు హ్యాక్ అయ్యాయంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ ఈవీఎం ఆరోపణలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్రం ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఆరోపణలపై మండిపడ్డారు. వారి వాదనలు నిరాధారమైనవని, ప్రతిపక్షాలు ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ‘‘లాతూర్’’ ఉదాహరణ చెప్పారు. లాతూర్ సిటీలో కాంగ్రెస్ అభ్యర్థి అమిత్ దేశ్‌ముఖ్ గెలుపును గురించి ఫడ్నవీస్ చెప్పారు. అమిత్ బీజేపీ అభ్యర్థిని 7000 ఓట్లకు పైగా తేడాతో ఓడించారు. లాతూర్ రూరల్ నుంచి పోటీ చేసిన ధీరజ్ దేశ్‌ముఖ్ బీజేపీ అభ్యర్థి రమఏష్ కాశీరామ్ కరాద్ చేతిలో 6500 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
Read Also: Minister Narayana: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యలకు నెల రోజుల్లో పరిష్కారం
‘‘నేను వారిని సూటిగా అడుగుతున్నాను. అమిత్ దేశ్‌ముఖ్ లాతూర్ సిటీ నుంచి, ధీరజ్ దేశ్‌ముఖ్ లాతూర్ రూరల్ నుంచి పోటీ చేశారు. అయితే ధీరజ్ నియోజకవర్గంలో ఈవీఎంలు హ్యాక్ అయ్యాయా..? అమిత్ నియోజకవర్గంలో కాలేదా..?’’ అని ఫడ్నవీస్ ప్రశ్నించారు. జార్ఖండ్‌లో ఇండియా కూటమి గెలిచినప్పుడు, నాందేడ్ ఎంపీ సీటు నుంచి కాంగ్రెస్ గెలిచనప్పుడు ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు..? అని కాంగ్రెస్‌ని నిలదీశారు. ఇదంతా వారి పిల్లల మనస్తత్వం, వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని చెబుతున్నా అంటూ ఫడ్నవీస్ అన్నారు.
ఎంవీఏ నాయకుడు నిన్నటి ప్రమాణస్వీకారానికి గైర్హాజరు కావడం గురించి మాట్లాడుతూ.. శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, సుశీల్‌కుమార్ షిండే, పృథ్వీరాజ్ చవాన్‌లతో తాను వ్యక్తిగతంగా మాట్లాడానని, వారు హాజరుకాకపోవడానికి ముందస్తు సమావేశాలు కారణమని చెప్పారు. వారు హాజరైతే సంతోషించే వాడిని అని అన్నారు. గురువారం సాయంత్రం ముంబైలో జరిగిన భారీ వేడుకలో ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి నేతలు ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు.