Site icon NTV Telugu

Lucknow: ఎన్‌డీఏలో చేరనున్న ఎస్‌బీఎస్‌పీ.. అమిత్‌ షాతో భేటీ అనంతరం ప్రకటించిన ఓం ప్రకాష్‌ రాజ్‌ భార్‌

Lucknow

Lucknow

Lucknow: భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతృత్వంలోని ఎన్‌డీఏలో సుహైల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) చేరనుంది. ఎన్‌డిఎలో చేరుతున్నట్లు ఎస్‌బీఎస్‌పీ చీఫ్ ఓం ప్రకాష్ రాజ్ భార్‌ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేసిన ఎస్‌బీఎస్‌పీ.. ఫలితాలు వెలువడిన కొన్ని నెలలకే ఆ పొత్తు నుంచి బయటకు వచ్చేసింది. తాజాగా రాజ్‌భార్ న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన ఒక రోజు తర్వాత.. తమ పార్టీ ఎన్టీఏలో చేరుతున్నట్టుగా ప్రకటన చేశారు. ఈ పరిణామం రాజకీయంగా కీలకమైన తూర్పు యూపీ ప్రాంతంలో ఓబీసీలలో బీజేపీ తన బలమైన స్థావరాన్ని పటిష్టం చేయడంలో సహాయపడుతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Read also: Purandeshwari: ఎన్నికలకు ఐదారు నెలల సమయమే.. నేతలకు పురంధేశ్వరి దిశానిర్ధేశం

ఎన్డీయేలో ఎస్‌బీఎస్‌పీ చేరికపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. ఢిల్లీలో ఓం ప్రకాష్ రాజ్‌భార్‌తో భేటీ కావడం జరిగిందని.. ఆయన ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరాలని నిర్ణయించుకున్నారని.. ఆయనను ఎన్డీయే కుటుంబానికి స్వాగతిస్తున్నానని ట్వీట్‌లో అమిత్ షా పేర్కొన్నారు. రాజ్‌భార్ రాకతో ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీఏ బలపడుతుందని.. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం మోదీ నాయకత్వంలో ఎన్డీయే చేస్తున్న కృషికి మరింత బలం చేకూరుతుందని ట్వీట్ చేశారు.

Read also: Minister Talasani: రాజకీయాలకు అతీతంగా బోనాల జాతర

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్, ఘోసిలోని కనీసం రెండు లోక్‌సభ స్థానాల నుండి తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలని రాజ్‌భార్ కోరినట్లు సమాచారం. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఆయనకు యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లో స్థానం కల్పించే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
తూర్పు ఉత్తరప్రదేశ్ జిల్లాల్లో గణనీయమైన జనాభాను కలిగి ఉన్న రాజ్‌భార్ కమ్యూనిటీ.. ఎన్నికల్లో అభ్యర్థుల అదృష్టాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుందనే లెక్కలు ఉన్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌పీఎస్‌పీ కనీసం నాలుగు సీట్లు గెలుచుకున్నప్పుడు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో భాగంగా ఉంది. యోగి కేబినెట్‌లో రాజ్‌భార్‌ను తీసుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో విభేదాలు రావడంతో వైదొలగాలని నిర్ణయించుకున్నారు. అయితే 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో కలిసి ఎస్‌బీఎస్‌పీ పొత్తు ఏర్పరుచుకుంది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది నెలలకే సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు నుంచి ప్రకాష్ రాజ్‌భార్ వైదొలిగారు.

Exit mobile version