NTV Telugu Site icon

Olympics: 2036 ఒలింపిక్స్ భారత్‌లో..? ప్రభుత్వం అధికారిక బిడ్..

Olympics

Olympics

Olympics: ప్రపంచంలో అత్యున్నత క్రీడావేదిక ‘‘ఒలింపిక్స్’’ని భారత్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. భారత ఒలింపిక్స్ అసోసియేషన్(ఐఓఏ) 2036లో భారతదేశంలో ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ)కి అధికారికంగా ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ని పంపింది. ఒలింపిక్స్‌ని నిర్వహించేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. 2036లో పారాలింపిక్స్ క్రీడలు జరుగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2036లో భారత్ ఒలింపిక్స్, పారాలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలనే ప్రధాని నరేంద్రమోడీ కలలకు ఇది అద్దంపడుతోంది.

ఒక వేళ ఈ అవకాశం లభిస్తే భారత్‌లో యువత సాధికారత, ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి పెంపొందించే విషయంలో ప్రయోజనాలను తీసుకురాగలదు. పలు సందర్భాల్లో ఈ క్రీడల నిర్వహణ గురించి ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పారిస్ ఒలింపిక్స్ అథ్లెట్లతో జరిగిన సంభాషణల్లో 2036 ఒలింపిక్స్ నిర్వహణ గురించి మాట్లాడారు. “భారతదేశం 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఈ విషయంలో, గత ఒలింపిక్స్‌లో ఆడిన అథ్లెట్ల నుండి ఇన్‌పుట్ చాలా ముఖ్యం. మీరందరూ చాలా విషయాలను గమనించి, అనుభవించి ఉంటారు. మేము దీనిని డాక్యుమెంట్ చేసి ప్రభుత్వంతో పంచుకోవాలనుకుంటున్నాము.” ప్రధాని అన్నారు.

Read Also: AUS vs IND: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌.. భారత్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం!

గతేడాది ముంబైలో జరిగిన 141వ IOC సెషన్‌లో, 140 కోట్ల మంది భారతీయులు క్రీడలను నిర్వహించడానికి కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోడీ అన్నారు. ఇది 140 కోట్ల మంది భారతీయుల చిరకాల స్వప్నంగా ఆయన అభివర్ణించారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ థామస్ బాచ్ కూడా భారత్ ఆసక్తిని సమర్థించారు.

2036 ఒలింపిక్ క్రీడల్ని నిర్వహించడానికి భారత్‌తో పాటు మరో 10 దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. మెక్సికో (మెక్సికో సిటీ, గ్వాడలజారా-మాంటెర్రే-టిజువానా), ఇండోనేషియా (నుసంతారా), టర్కీ (ఇస్తాంబుల్), ఇండియా (అహ్మదాబాద్), పోలాండ్ (వార్సా, క్రాకో), ఈజిప్ట్ ( కొత్త అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్), మరియు దక్షిణ కొరియా (సియోల్-ఇంచియాన్) పోటీలో ఉన్నాయి.

Show comments