Lalu Prasad Yadav: ప్రస్తుతం దేశంలో భారత్ వర్సెస్ ఇండియాగా వ్యవహారం నడుస్తోంది. కేంద్రం ఇండియా పేరును భారత్ గా మారుస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జీ20 సమావేశాల్లో దేశాధినేతలకు విందు ఇచ్చే ఆహ్వాన పత్రంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా వ్యవహరించడం, ఇదే విధంగా ప్రధాని ఇండోనేషియా పర్యటనకు సంబంధించిన నోట్ లో కూడా ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా’ బదులుగా ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’గా వ్యవహరించడం ఈ వాదనలకు బలాన్ని చేకూరుస్తోంది.
ఇదిలా ఉండగా కొన్నేళ్ల క్రితం రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) నేత లాలూ ప్రసాద్ యాదవ్ ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్, ఇండియాకు మధ్య వ్యత్యాసాన్ని వివరించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వేప పుల్లలో పళ్లు తోముకుంటూ లాలూ ప్రసాద్ యాదవ్ ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. ఢిల్లీలో వేప పుల్లలు దొరుకుతాయా..? అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించినప్పుడు ఢిల్లీ ఇండియా కిందకు వస్తుందని, పాట్నా భారత్ కిందకు వస్తుందని, పళ్లు తోముకునేందుకు వేపపుల్లలు భారత్ లో సులువుగా దొరుకుతాయని ఆయన చెప్పడం ఈ వీడియోలో చూడవచ్చు.
సెప్టెంబర్ 18-22 మధ్య జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఇండియా పేరు భారత్ గా మారుస్తూ బిల్లు పెట్టవచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటనైతే రాలేదు. కానీ ఈ పేరు మార్పుపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. విపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమి అని పేరు పెట్టుకోవడం వల్లే బీజేపీ భయపడి దేశం పేరు భారత్ గా మార్చాలని చూస్తోందని విమర్శలు గుప్పిస్తున్నాయి.
Lallu said it long ago
😂😂😂 #BharatVsIndia
pic.twitter.com/7qLHVMju67— Dr MJ Augustine Vinod 🇮🇳 (@mjavinod) September 5, 2023