Odisha Train Tragedy: ఒడిశా రాష్ట్రంలో బాలాసోర్ సమీపంలోని బహనాగా బజార్ రైల్వే స్టేషన్ లో కోరమాండల్ ఎక్స్ ప్రెస్, గూడ్స్ రైలు, యశ్వంతపూర్ రైళ్లు ఢీకొట్టుకున్న ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతి కలిగించింది. రైల్వే శాఖ మూడు దశాబ్ధాల్లో ఎప్పుడూ చూడని ఘోరమైన ప్రమాదం జరిగింది. దాదాపుగా 280 కన్నా ఎక్కువ మంది ప్రజలు మరణించారు. 1000 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. ఒక్కసారిగా బహనాగా బజార్ అనే చిన్న గ్రామం ఈ ప్రమాదంతో వార్తల్లో నిలిచింది. ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్తులు సహాయక చర్యల్లో పాల్గొని చాలా మంది ప్రాణాలు కాపాడగలిగారు. చాలా మంది కోసం అక్కడి యువకులు రక్తదానం చేశారు.
Read Also: Chicken Prices: చికెన్ ప్రియులకు షాక్.. కొండెక్కిన కోడి ధరలు..!
ఇదిలా ఉంటే ఇంతటి ఘోర ప్రమాదాన్ని బహనాగా ప్రజలు మరిచిపోలేకపోతున్నారు. మరణించిన వారికి స్మారకంగా హిందూ సంప్రదాయం ప్రకారం పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగి 10 రోజులు పూర్తయిన సందర్భంగా సామూహికంగా గ్రామస్తులు గుండ్లు కొట్టించుకుంటున్నారు. స్థానికులు, వాలంటీర్లు, సామాజిక కార్యకర్తలు క్షౌరం చేయించుకుంటున్నారు. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరేలా హిందూ సంప్రదాయం ప్రకారం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మరణించిన వ్యక్తుల జ్ఞాపకార్థం మరియు గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ సంస్మరణ సభను నిర్వహించారు. 3 రోజుల సంస్మరణ సభ బహనాగ హైస్కూల్ ప్రాంగణం సమీపంలోని మైదానంలో నిర్వహించారు. 10 రోజు సామూహిక శిరోముండనం చేయించుకున్నారు. 11వ రోజు ‘విశ్వ శాంతి మహా యజ్ఞం’, ‘అస్తప్రహరి నామ సంకీర్తన’, ‘అఖండ గాయత్రీమంత్రం’ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 12 రోజు ‘సత్సంగం’, క్యాండిల్ లైట్ మార్చ్ ను ఏర్పాటు చేశారు. బహనాగాలో జరిగిన విషాద ట్రిపుల్ రైలు ప్రమాదంలో కనీసం 288 మంది మరణించగా, 1000 మందికి పైగా ప్రజలు తీవ్ర గాయాలతో తృటిలో తప్పించుకున్నారు.
