CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..

  • ఒడిశా స్కూల్ పుస్తకాల వివాదంలోకి సీజేపీ ఎంట్రీ..
  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్..
Cjp

Cjp

CJP: ఒడిశాలో పాఠ్యపుస్తకాల్లో తప్పిదాలకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) డిమాండ్ చేసింది. ఆ పార్టీ కో కన్వీనర్ సౌరవ్ దాస్ భువనేశ్వర్‌ పరిసరాల్లో ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. పాఠ్యపుస్తకాల్లో తప్పిదాలకు బాధ్యత వహిస్తూ స్కూల్ అండ్ మాస్ ఎడ్యుకేషన్ మంత్రి నిత్యానంద గోండ్ రాజీనామా చేయాలని కోరారు.

ఒడిశాలో 2026-27 విద్యా సంవత్సరానికి 1 నుంచి 8వ తరగతి వరకు రూపొందించిన పాఠ్యపుస్తకాల్లో మొత్తం 1,678 వాస్తవ, టైపోగ్రాఫికల్, ప్రింటింగ్ తప్పిదాలను గుర్తించారు. ఈ విషయమై ప్రభుత్వంపై విమర్శలు రావడంతో విచారణ చేపట్టింది. విచారణ తర్వాత ముగ్గురు అధికారుల్ని సస్పెండ్ చేశారు. మరో ఆరుగురిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పుస్తకాల తయారీ, సమీక్ష, ప్రచురణ ప్రక్రియలో మార్పులకు సంబంధించి కమిటీ చేసిన 14 సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. మరోవైపు, ఒడిశా ప్రభుత్వం సవరించిన పుస్తకాల పంపిణీని ప్రారంభించింది. 1 నుంచి 8వ తరగతి వరకు పుస్తకాలను అందిస్తున్నారు.

నవనిర్మాణ్ యువ ఛాత్ర సంఘటన్(NYCS) పాఠ్యపుస్తకాల్లో తప్పులపై నిరసన చేపట్టింది. మంగళవారం ఒడిశా అసెంబ్లీని ముట్టడించాలని ప్లాన్ చేసింది. ఈ ఆందోళనకు సీజేపీ మద్దతు తెలిపింది. ఇదిలా ఉంటే, సీజేపీ ఆరోపణలపై బీజేపీ ప్రతినిధి అనిల్ బిశ్వాల్ స్పందించారు. సీజేపీ కాంగ్రెస్, ఆప్‌లకు బీ-టీమ్‌గా మారిందని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తప్పులు వెతుకుతోందని, ఇతర రాష్ట్రాల్లో విద్యార్థుల సమస్యలపై మౌనంగా ఉంటోందని విమర్శించారు.