నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET (UG) 2026 రీ-ఎగ్జామ్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తలను పూర్తిగా ఖండించింది. ఈ వదంతులు పూర్తిగా అవాస్తవమని, విద్యార్థులను మోసం చేయడానికి కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని NTA తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, మెసేజింగ్ యాప్‌లలో NEET రీ-ఎగ్జామ్ ప్రశ్నాపత్రం ముందుగానే లభిస్తుందని, విక్రయిస్తున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో NTA స్పందించింది. ఈ తరహా సందేశాలను నమ్మవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచించింది.
NTA ప్రకారం, NEET (UG) 2026 రీ-పరీక్ష నిర్వహణకు అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని, పరీక్ష పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించబడుతుందని స్పష్టం చేసింది. పరీక్షా ప్రక్రియ సమగ్రతకు ఎటువంటి భంగం కలగలేదని పేర్కొంది. అధికారిక సమాచారం కోసం విద్యార్థులు కేవలం NTA అధికారిక వెబ్‌సైట్, అధికారిక ప్రకటనలనే అనుసరించాలని సూచించింది. సోషల్ మీడియాలో వచ్చే నిర్ధారణ లేని వార్తలను నమ్మవద్దని హెచ్చరించింది.
అలాగే ప్రశ్నాపత్రం లీక్ అయిందని లేదా విక్రయిస్తున్నామని తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని NTA హెచ్చరించింది. ఇప్పటికే కొన్ని ఫిర్యాదులను సైబర్ క్రైమ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. విద్యార్థులు ఎలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, పరీక్షలపై వచ్చే ప్రతి సమాచారాన్ని అఫీషియల్ సోర్స్ ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలని NTA సూచించింది.

