Neha Bora: నీట్ పేపర్ లీక్ తర్వాత జంతర్ మంతర్ ఉద్యమం నుంచి నేహా బోరా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అధ్యక్షురాలు నేహా బోరా ప్రస్తుతం యాంటీ-సీఈసీ నిరసనల్లో విస్తృత కవరేజ్ సంపాదిస్తున్నారు. వామపక్ష భావజాలం ఉన్న నేహా, ఇటీవల రాహుల్ గాంధీ సుప్రీంకోర్టుకు నిర్వహించిన పాదయాత్రలో ముందు వరసలో కనిపించారు. రాహుల్ ముందు నేహా బోరా, ప్రియాంకాగాంధీ నడిచిన వీడియోలో ఇంటర్నెట్లో వైరల్గా మారాయి.
అయితే, ఇప్పుడు ఈ పరిణామాలే కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI)లో అసంతృప్తికి కారణమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో నేహా బోరాకు లభిస్తు్న్న ఆదరణ NSUIలో చర్చనీయాంశంగా మారింది. ఈ అసంతృప్తి నేపథ్యంలో NSUI అధికారిక వాట్సాప్ గ్రూప్ పేరును ఒక సభ్యుడు మూడు రోజుల పాటు ‘‘ WE THE Chhotu ’’ అని మార్చడం చర్చకు దారి తీసింది. హిందీలో ‘‘చోటు’’ అనే పదాన్ని చిన్న వ్యక్తి లేదా ఇతరుల పనిచేసే వ్యక్తి అనే అర్థంలో ఉపయోగిస్తారు.
రాహుల్ పక్కన నేహా బోరా.. ఇదే అసలు అసంతృప్తి..
నేహా బోరాకు రాహుల్ గాంధీ ఎనలేని ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంది NSUI నేతలకు నచ్చడం లేదు. ఇండియా కూటమి నేతలు ఇటీవల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సుప్రీంకోర్టుకు మార్చ్ నిర్వహించారు. ఈ సమయంలో రాహుల్ గాంధీ ముందు నేహా బోరా ఉంది. రాహుల్ ప్రియాంకా, నేహాలపై చేతులు వేసి నడుస్తున్న ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. ఈ నిరసనల్లో NSUI జాతీయ అధ్యక్షుడు వినోద్ ఝాకర్ సహా పలువురు నేతలు కూడా ఆ నిరసనలో పాల్గొన్నారు.
అయితే, తాము కాంగ్రెస్ నిరసనల్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తుంటే నేహా బోరా మాత్రం క్రెడిట్ కొట్టేస్తోందని అసంతృప్తి కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల పలు సందర్బాల్లో రాహుల్ గాంధీ నేహా బోరాతో సమావేశమయ్యారు. సీజేపీ నిర్వహించిన జంతర్ మంతర్ ఉద్యమం వేళ నేహా బోరా నిరాహార దీక్ష చేపట్టారు. ఆ తర్వాత ఆమె రాహుల్ గాంధీని 10జన్పథ్లో కలిశారు. ఇటీవల అక్టోబర్ 13న రాహుల్ గాంధీ తన నివాసంలో ఏర్పాటు చేసిన టీ విందుకు కూడా నేహా బోరాకు ఆహ్వానం లభించింది.
రాహుల్తో భేటీ తర్వాత మళ్లీ పేరు మార్పే..
NSUI నేతలు రాహుల్ గాంధీని కలిసిన తర్వాతే వాట్సాప్ గ్రూప్ పేరును తిరిగి మార్చినట్లు తెలుస్తోంది. అయితే, నేహా బోరాకు ఇస్తున్న ప్రాధాన్యంపై ఎవరూ కూడా రాహుల్ గాంధీ ముందు ఫిర్యాదు చేయలేని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, NSUI జాతీయ అధ్యక్షుడు వినోద్ ఝాకర్ మాత్రం నేహా బోరా విషయంలో తమ విభాగంలో ఎలాంటి అసంతృప్తి లేదని ఖండించారు. కాంగ్రెస్ మీడియా ఇన్ఛార్జ్ పవన్ ఖేరా మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను లేవనెత్తే ప్రతి గొంతుకకు కాంగ్రెస్ వేదిక కల్పిస్తుందని చెప్పారు.

