NTV Telugu Site icon

Bihar: “ఇలాంటివి కొత్త కాదు”.. పోలీస్ అధికారి హత్యపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

Bihar

Bihar

Bihar: బీహార్‌‌లోని జాముయి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌తో పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్‌ని తొక్కించి చంపేశారు. ఈ ఘటనలో హోంగార్డుతో సహా ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ప్రస్తుతం వీరికి ఆస్పత్రిలో చికిత్సను అందిస్తున్నారు. ఈ ఘటన జముయ్ లోని మహులియా తాండ్ గ్రామంలో చోటు చేసుకుంది. చనిపోయిన ఎస్సై ప్రభాత్ రంజన్‌గా గుర్తించారు. అతని సొంత జిల్లా సవాయ్ కాగా.. గర్హి పోలీస్ స్టేషన్ ఇన్‌‌చార్జ్‌గా పనిచేస్తున్నారు. ఘటన తర్వాత అతనిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకుండా పోయింది.

ఈ హత్యపై బీహార్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘటనలు కొత్త కాదని, ఇవి జరుగుతూనే ఉన్నాయని, గతంలో ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. ఈ కేసులో నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడుతుందని మంత్రి తెలిపారు.

Read Also: Manchu Lakshmi: మంచు లక్ష్మీకి ముద్దు ఇచ్చిన అల్లు హీరో.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫోటో

చనిపోయిన పోలీస్ అధికారి ప్రభాత్ రంజన్‌కి నాలుగేళ్ల కుమార్తె, 6 నెలల కుమారుడు ఉన్నారు. అతని కుటుంబం మొత్తం ఢిల్లీలోనే ఉంటుంది. జముయ్ ఘటనలో గాయపడిన హోంగార్డును రాజేష్ కుమార్‌గా గుర్తించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడిన మిథిలేష్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఎస్పీ శౌర్య సుమన్ తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నాడు.

మరోవైపు ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. జముయ్ ఎంపీ చిరాగ్ పాశ్వార్, సీఎం నితీష్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక స్మగ్లర్లపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ప్రజలు నదిలో మునిగి చనిపోతున్నారని మండిపడ్డారు. ఈ ఘటనకు ముందు బీహార్ లోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ నెల ప్రారంభంలో ఇదే విధమైన సంఘటన జరిగింది. అక్రమం ఇసుక రవాణా చేస్తున్నారని తెలుసుకుని అక్కడికి వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్‌ని మాఫియా చితకబాదింది.

Show comments