NTV Telugu Site icon

SCO summit: కజకిస్తాన్ ఎస్‌సీఓ సమ్మిట్‌కి మోడీ బదులుగా జై శంకర్..

Sco Summit

Sco Summit

SCO summit: వచ్చే వారం కజకిస్తాన్ ఆస్తానాలో జరగబోయే ‘‘షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ)’’ సమావేశానికి భారత ప్రధాని నరేంద్రమోడీ వెళ్లే అవకాశం కనిపించడం లేదు. ఈ సమావేశాన్ని దాటవేయాలని ప్రధాని నిర్ణయించుకున్నట్లు సమాచారం. భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించేందుకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమావేశానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా 5 ఏళ్ల తర్వాత ప్రధాని మోడీ జూలై 08,09 వరకు రష్యాలో పర్యటించనున్నారు. రష్యా పర్యటన తర్వాత రెండు రోజుల పర్యటన కోసం జూలై 09న ఆస్ట్రియా వెళ్లే అవకాశం ఉంది.

Read Also: PM Modi: జూలై 8న ప్రధాని మోడీ రష్యా పర్యటన.. భారీ ఏర్పాట్లు చేస్తున్న క్రెమ్లిన్..

రష్యా, ఆస్ట్రియా పర్యటనలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోడీ ఎస్‌సీఓ సమ్మిట్‌కి గైర్హాజరు కానున్నట్లు సమాచారం. అయితే, మోడీ రెండు దేశాల పర్యటనపై ఇంకా అధికారికంగా ఎలాంటి ధృవీకరణ రాలేదు. జూలై 3 మరియు 4 తేదీల్లో జరగనున్న SCO సమ్మిట్ ప్రాంతీయ భద్రతా పరిస్థితి మరియు కనెక్టివిటీ మరియు వాణిజ్యాన్ని పెంచే మార్గాలపై దృష్టి పెడుతుందని భావిస్తున్నారు.

విదేశీవ్యవహారాల మంత్రిత్వశాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, SCO సమ్మిట్‌లో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నాయకత్వం వహిస్తారని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి, ఉక్రెయిన్ వివాదం, ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య భద్రతా సహకారాన్ని పెంచడంపై ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చ జరగబోతోంది. మంగళవారం ప్రధాని మోడీ కజకిస్తాన్ అధ్యక్షుడు కస్సిమ్ జోమార్ట్ టోకాయేవ్‌తో ఫోన్‌లో సంభాషిస్తూ, సమ్మిట్ విజయవంతానికి భారత్ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం కజకిస్తాన్ అధ్యక్ష హోదాలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది. భారతదేశం, చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లు ఎస్‌సీఓ సభ్యదేశాలుగా ఉన్నాయి.