NTV Telugu Site icon

Nitish kumar: నీతి అయోగ్ సమావేశానికి నితీష్ కూడా డుమ్మా? సర్వత్రా చర్చ

Nitiaayog

Nitiaayog

దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన శనివారం నీతి అయోగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఎన్డీయేతర ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ముఖ్యమంత్రులు ఆహ్వానింపబడ్డారు. అయితే ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఎన్డీయేతర ముఖ్యమంత్రులు గుర్రుగా ఉన్నారు. దీంతో వారు ఎవరు ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఇక మోడీ 3.0 ప్రభుత్వం మిత్రపక్షాలైన జేడీయూ, తెలుగుదేశం సపోర్టుతో ఏర్పడింది. అంతేకాకుండా బడ్జెట్‌లో బీహార్, ఏపీ రాష్ట్రాలకు భారీగానే నిధులు కేటాయించింది. ఏపీ సీఎం చంద్రబాబు.. హర్షం వ్యక్తం చేశారు. ఇక శనివారం జరిగే సమావేశానికి చంద్రబాబు ఒకరోజు ముందుగానే ఢిల్లీకి చేరుకున్నారు. మరో మిత్ర పక్షమైన జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ మాత్రం డుమ్మా కొట్టారు. ఈ సమావేశం ఉందని ముందుగానే తెలిసినా.. హాజరు కాలేదు. ఇప్పుడిదే రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టకముందు.. నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూ.. బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. అయితే లోక్‌సభలో బీహార్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తేలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో నితీష్‌కుమార్‌పై ప్రతిపక్షాల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. ఎన్డీఏ నుంచి బయటకు రావాలని.. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక బడ్జెట్‌లో బీహార్ రోడ్ల కోసం కేంద్రం నిధులు కేటాయించినా.. జేడీయూ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. దీంతో జేడీయూ అసంతృప్తిగానే ఉందని వార్తలు వినిపించాయి.

ఈ నేపథ్యంలోనే శనివారం మోడీ అధ్యక్షతన జరిగిన నీతి అయోగ్ సమావేశానికి నితీష్‌కుమార్ హాజరుకాలేదని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బీహార్‌కు చెందిన ఇద్దరు డిప్యూటీ సీఎంలు మాత్రమే వెళ్లారు. ఈ కీలక సమావేశానికి ముఖ్యమంత్రే స్వయంగా హాజరై.. రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి ప్రస్తావించాల్సి ఉండగా.. నితీష్ హాజరు కాకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఇక ఈ సమావేశానికి ఎన్డీయేతర ముఖ్యమంత్రుల్లో పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ హాజరయ్యారు. కానీ సమావేశంలో ఎంత సేపు ఉండలేదు. వాకౌట్ చేసి బయటకు వచ్చి.. మీడియాతో ఆవేశంతో మాట్లాడారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతుండగా.. తన మైక్ కట్ చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష ముఖ్యమంత్రులెవ్వరూ హాజరు కాకపోయినా.. తాను హాజరయ్యానని.. కానీ మాట్లాడే సమయం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. అందుకే సమావేశం నుంచి బయటకు వచ్చేసినట్లు పేర్కొన్నారు.

ఇక సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేరళ ముఖ్యమంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ గైర్హాజరయ్యారు. ఇదంతా ఒకెత్తు అయితే.. ఎన్డీఏలో భాగస్వామి అయిన నితీష్ ఎందుకు హాజరు కాలేదన్నదే ఆసక్తిగా మారింది. సంకీర్ణ ప్రభుత్వంలో ఏదో జరుగుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.