PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన

  • విదేశీ ప్రయాణాలపై పన్ను అంటూ నివేదికలు
  • ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం తీవ్రంగా ఖండించారు
  • అందులో రవ్వంత కూడా నిజం లేదు
Modi

Modi

విదేశీ ప్రయాణాలపై పన్ను లేదా సర్‌ఛార్జ్ విధించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందనే మీడియా నివేదికలను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం తీవ్రంగా ఖండించారు. అందులో రవ్వంత కూడా నిజం లేదు అని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’లో ప్రధాని మోడీ పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. “ఇది పూర్తిగా తప్పు. ఇందులో ఒక్క ఇంచు సత్యం కూడా లేదు. విదేశీ ప్రయాణాలపై ఎలాంటి నిబంధనలు విధించే ప్రశ్నే లేదు. మా ప్రజల ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’, ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ను మెరుగుపరచడానికి మేము కట్టుబడి ఉన్నాము అని ఎక్స్ పోస్ట్ లో మోడీ తెలిపారు.

CNBC-TV18 సహా కొన్ని మీడియా సంస్థలు ఇటీవలి నివేదికల్లో, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సమస్యల కారణంగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు, దిగుమతి ఖర్చులను భరించడానికి విదేశీ ప్రయాణాలపై తాత్కాలికంగా సెస్ లేదా సర్‌ఛార్జ్ విధించాలని ప్రభుత్వం ఉన్నత స్థాయిలో చర్చిస్తోందని పేర్కొన్నాయి. ఈ నివేదికలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నివేదికలకు ప్రధాని మోడీ స్వయంగా స్పందించడం అరుదైన విషయం.

మోడీ ఇచ్చిన క్లారిటీతో ఆ నివేదికలు తప్పుడవని నిరూపితమయ్యాయి. కొంతమంది మీడియా సంస్థలు తమ నివేదికను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పినట్లు సమాచారం. ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యల ద్వారా ప్రభుత్వం ప్రజల సౌకర్యానికి, వ్యాపారాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుతం పీఎం మోడీ ఐదు దేశాల పర్యటనలో ఉన్నారు. ఈ సంఘటన ప్రజల మధ్య భయాలు, అపోహలను తొలగించింది. విదేశీ ప్రయాణాలు, టూరిజం, వ్యాపార ప్రయాణాలపై ఎలాంటి కొత్త పన్ను విధించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.