Site icon NTV Telugu

UP: నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్.. ఆయుధాలు స్వాధీనం

Uparrest

Uparrest

నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులను ఉత్తర ప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. సోషల్ మీడియా ద్వారా యువతను తీవ్రవాద భావజాలం వైపు మళ్లిస్తూ.. ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఇద్దరూ కూడా పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్లు, ఐఎస్ఐ కోసం పని చేస్తున్నట్లుగా గుర్తించారు. వారి దగ్గర నుంచి పిస్టళ్లు, మందుగుండు సామగ్రి, కత్తులు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

ఐఎస్ఐ ఆదేశాల మేరకు భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఏటీఎస్ నిఘా పెట్టింది. సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భారత యువతను లక్ష్యంగా చేసుకుని ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న బాఘ్‌పత్‌కు చెందిన తుషార్ చౌహాన్ అలియాస్ హిజ్బుల్లా అలీ ఖాన్(20), ఢిల్లీకి చెందిన సమీర్ ఖాన్‌(20)ను అరెస్ట్ చేశారు. పాకిస్థానీ గ్యాంగ్‌స్టర్లతో నేరుగా సంబంధాలు పెట్టుకుని, ఒక పెద్ద ఉగ్రవాద దాడికి పాల్పడేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా కనిపెట్టారు.

నిందితులపై బీఎన్ఎస్, ఆయుధాల చట్టం, యూఏపీఏ సెక్షన్ల కింద అభియోగాలు మోపి కోర్టులో హాజరుపరిచారు. వారి నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల గురించి సమాచారం సేకరించేందుకు పోలీస్ కస్టడీ రిమాండ్ కోరేందుకు కూడా ఏటీఎస్ సిద్ధమైంది. ఈ చర్యతో ఒక ప్రధాన ఉగ్రవాద కుట్ర భగ్నం చేయబడిందని, దేశ వ్యతిరేక శక్తులపై పోరాటం భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఏటీఎస్ పేర్కొంది.

Exit mobile version