NTV Telugu Site icon

Supreme Court: “ప్రార్థనా స్థలాల చట్టం”.. మందిర్-మసీదు వివాదాలపై సుప్రీం కీలక ఆదేశాలు..

Supreme Court

Supreme Court

Supreme Court: ‘‘ప్రార్థనా స్థలాల చట్టం-1991’’కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే, ఈ పిటిషన్ పరిష్కరించే వరకు కొత్తగా ఎలాంటి పిటిషన్లు స్వీకరించొద్దని సూచించింది. మందిర్-మసీద్ వివాదాల్లో ఎలాంటి సర్వేలను అనుమతించమని చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న ట్రయల్ కోర్టులు మతపరమైన స్వభావాన్ని నిర్ణయించేందుకు ఎలాంటి ఆదేశాలు, సర్వేలు జారీ చేయవద్దని గురువారం అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

1991 ప్రార్థనా స్థలాల చట్టం రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టు ముందు దాఖలయ్యాయి. ఈ చట్టం రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తుందని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు పీవీ సంజయ్ కుమార్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ విషయం సుప్రీంకోర్టు ముందు విచారణలో ఉన్నందున, విచారణ ముగిసే వరకు ఎలాంటి సర్వేలకు ఆదేశాలు ఇవ్వొద్దని కింది కోర్టులను ఆదేశించింది.

Read Also: Calcium Drinks: శరీరంలో కాల్షియం లోపాన్ని తగ్గించాలంటే ఈ డ్రింక్స్ తాగితే సరి

ప్రార్థనా స్థలాల చట్టం ప్రకారం.. ఆగస్టు 15, 1947 నాటికి ఒక ప్రార్థనా స్థలం ఎలాంటి స్థితిని కలిగి ఉందో, ఆ స్థితిని మార్చేందుకు నిరాకరింస్తుంది. అయితే, ఈ చట్టం జైనులు, హిందువులు, బౌద్ధులు, సిక్కుల హక్కుల్ని ఉల్లంఘిస్తుందని పిటిషన్లు పేర్కొన్నారు. ఇది ఆర్టికల్ 26,26, 29 రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘిస్తుందని తెలిపారు.

విచారణ సందర్భంగా కేంద్ర కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేయని విషయాన్ని సీజేఐ గుర్తు చేశారు. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. 1991 చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై స్పందించేందుకు తనకు సమయం కావాలని కోరారు. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశంలోని చాలా మసీదులు, హిందువుల పురాతన ఆలయాలపై నిర్మించారనే వివాదం నడుస్తోంది. ఇటీవల కాలంలో సంభాల్ జామా మసీదు, జౌన్‌పూర్‌లో అటాలా మసీదులు వివాదాస్పదమయ్యాయి. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు, మథురలోని షాహీ ఈద్గా మసీదు,రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాపై వివాదాలు ఉన్నాయి.

Show comments