Marital Rape: వైవాహిక అత్యాచారాలను నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకి తెలిపింది. ఎందుకుంటే తగినన్ని శిక్షాణాత్మక చర్యలు రూపొందించబడ్డాయని పేర్కొంది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించడం సుప్రీంకోర్టు పరిధిలో లేదని కేంద్రం తెలిపింది. వైవాహిక అత్యాచారం అనేది చట్టబద్ధమైన సమస్య కన్నా సామాజిక సమస్య అని, ఇది సమాజంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని కేంద్రం పేర్కొంది. అందరు వాటాదారులతో సంప్రదింపులు లేకుండా, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా ఈ సమస్యని వైవాహిక అత్యాచారంగా నిర్ణయించలేమని కేంద్రం తెలిపింది.
వైవాహిక అత్యాచార బాధితులకు ప్రస్తుత చట్టాలు సరిపోతాయని కేంద్రం చెప్పింది. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కేంద్రం వ్యతిరేకించింది, ప్రస్తుతం ఉన్న రేప్ చట్టాల ప్రకారం, భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధాలకు మినహాయింపు ఉంది. వైవాహిక వేధింపుల బాధితుల కోసం ప్రస్తుత చట్టాల్లో తగినన్ని చట్టపరమైన పరిష్కారాలు ఉన్నాయని, మినహాయింపులను కొట్టివేయడం వివాహ వ్యవస్థను అస్థిరపరచవచ్చని కేంద్రం వాదించింది.
Read Also: Surveillance Vulture: సరిహద్దులో “నిఘా రాబందు”.. కాళ్లకు జీపీఎస్, మైక్రో కెమెరా..
వివాహం అనేది మహిళ సమ్మతికి ముగింపు కాదని, ఏదైనా ఉల్లంఘన శిక్షాపరమైన పరిణామాలకు దారి తీస్తుందని కేంద్రం అంగీకరించినప్పటికీ, వివాహంలో ఇలాంటి ఉల్లంఘన యొక్క పరిణామం వివాహం బయట ఉల్లంఘనలకు భిన్నంగా ఉంటాయని చెప్పింది. వివాహ బంధంలో ఒకరు తన భాగస్వామి నుంచి సరైన లైంగిక సంబంధాలను కోరుకుంటారు. అయితే, ఇది భార్యని ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక సంబంధం పెట్టుకునే హక్కుని భర్తకు ఇవ్వదని చెబుతూనే, ఇలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తిపై అత్యాచార నిరోధక చట్టాల కింద శిక్ష విధించడం మితిమీరిన, అసమానమైన చర్యగా కేంద్రం పేర్కొంది.
వివాహంలో వివాహిత మహిళ సమ్మతిని రక్షించడానికి పార్లమెంట్ ఇప్పటికే చర్యల్ని అందించిందని, ఈ చర్యలలో వివాహిత మహిళలపై క్రూరత్వాన్ని శిక్షించే చట్టాలు ఉన్నాయిన కేంద్రం తెలిపింది. గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం- 2005 అనేది వివాహిత మహిళలకు సహాయపడే మరొక చట్టంగా చెప్పింది. ‘‘లైంగిక అంశం అనేది భార్యాభర్తల మధ్య సంబంధాల యొక్క అనేక అంశాలలో ఒకటి మాత్రమే, వారి వివాహానికి పునాది ఆధారపడి ఉంటుంది. భారతదేశం యొక్క సామాజిక-చట్టపరమైన పరిధిలోని వివాహ వ్యవస్థ యొక్క స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. వివాహ వ్యవస్థకి రక్షణ అవసరమని శాసనసభ అభిప్రాయపడితే, ఆ మినహాయింపును కోర్టు కొట్టివేయడం సరికాదు’’ అని కేంద్రం తెలిపింది.