Site icon NTV Telugu

Madhya Pradesh: ముస్లింలను జిమ్ లోకి అనుమతించకూడదు.. భోపాల్ ఎస్ఐ కామెంట్స్ వైరల్..

Bhopal

Bhopal

Bhopal: భోపాల్‌కి చెందిన ఎస్ఐ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. జిమ్ యజమానుల సమావేశంలో ఎస్ఐ దినేష్ శర్మ మాట్లాడుతూ.. ముస్లిం ట్రైనర్లు, శిక్షణ తీసుకోవడానికి వచ్చే వారిని జిమ్‌లోకి అనుమతించకూడదని జిమ్ యజమానులకు సూచించాడు. వీడియోలో ‘శిక్షణ ఇవ్వడానికి లేదా తీసుకోవడానికి ఏ ముస్లిం ఇక్కడకు రాడు. నేను మీకు స్పష్టంగా చెబుతున్నాను’’ అని అనడం వినవచ్చు. ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్‌లో ‘‘లవ్ జిహాద్’’ కేసులు వెలుగు చూస్తుండటంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

కొన్ని రోజుల క్రితం భజరంగ్ దళ్ సభ్యులు భోపాల్‌లోని అయోధ్య నగర్ ప్రాంతంలోని జిమ్‌కి వెళ్లారు. ఆ జిమ్‌లో ముస్లిం ట్రైనర్లు ఉన్నారా అని ఆరా తీశారు. ఆ సమయంలో ఉద్రిక్తతలు తగ్గించడానికి పోలీసులు అక్కడకి వెళ్లారు. ఆ సమయంలో ఎస్ఐ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో సీనియర్ పోలీస్ అధికారులు ఈ సంఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించారు.

Read Also: MI vs PBKS: క్వాలిఫయర్-2కి వరుణుడి గండం.. మ్యాచ్‌ రద్దయితే ఎవరికి లాభం..?

ఇంతలో, భోపాల్ ఎంపీ, బీజేపీ నాయకుడు అలోక్ శర్మ సబ్-ఇన్స్పెక్టర్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. ముస్లిం జిమ్ ట్రైనర్లపై ఆయన ఆందోళనలను వ్యక్తపరిచారు. భోపాల్‌లోని ట్రైనర్ల జాబితాను రూపొందించారని పేర్కొన్నారు. మహిళా క్లయింట్లకు మహిళా ట్రైనర్లను మాత్రమే కేటాయించాలని ఆయన అన్నారు. “జిమ్ ట్రైనర్ల జాబితాను పోలీసులకు అందజేస్తారు, వారు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటారు” అని ఆయన చెప్పారు. మధ్యప్రదేశ్‌లో మోహన్ యాదవ్ ప్రభుత్వం లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్‌ని అనుమతించదని హెచ్చరించారు.

ఇటీవల ఇండోర్ షూటింగ్ అకాడమిలో రైఫిల్ షూటింగ్ శిక్షకుడిగా ఉన్న మోహిసిన్ ఖాన్ అనే వ్యక్తి, హిందూ మహిళల్ని, బాలికల్ని టార్గెట్ చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక మహిళా ట్రైనీని వేధించాడనే ఆరోపణలో ఇండోర్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతడి ఫోన్‌‌ని పరిశీలించగా దాదాపుగా 150 మంది హిందూ బాలికల్ని ట్రాప్ చేసినట్లు తెలుస్తోంది. లైంగిక వేధింపులతో పాటు బాలికలు మతం మారేలా ప్రోత్సహించడం వంటి అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అంతేకాకుండా, ఇటీవలి నెలల్లో, భోపాల్‌తో పాటు మధ్యప్రదేశ్‌లోని చిన్న పట్టణాల్లో హిందూ మహిళలు మరియు బాలికలను లక్ష్యంగా చేసుకుని ఒక క్రమబద్ధమైన లైంగిక దోపిడీ రాకెట్ బయటపడినట్లు వార్తలు వస్తున్నాయి.

Exit mobile version