Bombay High Court: ఏ తల్లీ తన సొంత బిడ్డను కొట్టదు అని బాంబే హైకోర్టు మంగళవారం వ్యాఖ్యానించింది. ఏడేళ్ల కొడుకుపై దాడి చేసినందుకు తల్లితో సహా ఆమె భాగస్వామిపై కేసు నమోదై, అరెస్ట్ చేయబడ్డారు. అయితే, తాజాగా ఈ కేసులో బాలుడి తల్లి అయిన 28 ఏళ్ల మహిళకు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
బాలుడి తండ్రి, తల్లి మధ్య వైవాహిక వివాదం ఉంది. దీని కారణంగా ఆ బిడ్డ బాధపడుతున్నాడని, బలిపశువుగా మారాడని జస్టిస్ మిలింద్ జాదవ్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ వ్యాఖ్యానించింది. బాలుడి వైద్య నివేదికల ప్రకారం.. అతను మూర్ఛరోగంతో బాధపడుతున్నాడని, పోషకాహార లోపం, రక్తహీనతతో ఉన్నట్లు చూపిస్తు్న్నాయని కోర్టు తెలిపింది. నిందితురాలైన తల్లి బిడ్డ సంరక్షణకు మద్దతు అందించేందుకు చాలా ఇబ్బంది పడినట్లు వివిధ వైద్య పత్రాలు చూపిస్తున్నాయని పేర్కొంది.
Read Also: Work-Week Debate: “పనిగంటల”పై క్యాప్‌జెమిని ఇండియా సీఈఓ కీలక వ్యాఖ్యలు..
మహిళను అక్టోబర్ 2023లో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమె కస్టడీలోనే ఉంది. మైనర్ బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు ముంబైలో ఎఫ్ఐఆర్ నమోదైంది. అతడి భార్య, ఆమె భాగస్వామి అనేక సందర్భాల్లో బాలుడిపై శారీరకంగా దాడి చేసినట్లు తండ్రి ఫిర్యాదు చేశాడు. ఒకసారి చంపేందుకు యత్నించారని ఆరోపించారు. ముంబై దహిసర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మహిళ భాగస్వామి బాలుడిపై లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.
అయితే, హైకోర్టు ప్రాథమికంగా అన్ని ఆరోపణలు నమ్మశక్యం కాదని పేర్కొంది. ‘‘ఏ తల్లి కూడా తన సొంత బిడ్డని కొట్టాలని అనుకోదు’’ అని రూ. 15,000 వ్యక్తిగత పూచికత్తుపై మహిళకు హైకోర్టు బెయిల్‌ని మంజూరు చేసింది. ఈ కేసులో నిందితులకు అరెస్టుకు గల కారణాలను తెలియజేయడానికి సంబంధించిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని తప్పనిసరి నిబంధనలను పాటించడంలో పోలీసులు విఫలమయ్యారని కోర్టు గుర్తించింది. బాలుడి తల్లిదండ్రులు 2019లో విడిపోయిన తర్వాత, బాలుడు తన తండ్రితో కలిసి మహారాష్ట్రలోని రత్నగిరిలో నివసిస్తున్నాడు. అయితే, 2023లో బాలుడి తల్లి అతడిని బలవంతంగా ముంబైకి తీసుకెళ్లింది.