Site icon NTV Telugu

Judge: మంగళసూత్రం లేదు, బొట్టు లేదు.. భర్త ఎందుకు ఆసక్తి చూపిస్తాడు..

New Project

New Project

Judge: విడిపోయిన భార్యాభర్తల మధ్య మధ్యవర్తిత్వం చేస్తున్న సెషన్స్ కోర్ట్ జడ్జి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. జడ్జి సదరు మహిళను ఉద్దేశించి, ఆమెకు ‘‘బొట్టు’’, ‘‘మంగళసూత్రం’’ ధరించడం లేదని, మీ భర్తకు మీపై ఎందుకు ఆసక్తి చూపిస్తాడు..? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. పూణేకి చెందిన వివాదాలను వాదించే లాయర్ అంకుర్ ఆర్ జహంగీర్ దీని గురించి లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశారు. గృహహింస కేసులో సదరు జంట న్యాయమూర్తి ముందు హాజరయ్యారని జహంగీర్ తెలిపారు. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి న్యాయమూర్తి ప్రోత్సహించారని చెప్పాడు.

Read Also: Tamilisai: త్రిభాషా విధానానికి మద్దతుగా ఆందోళన.. తమిళిసై అరెస్ట్

‘‘నువ్వు మంగళసూత్రం వేసుకోలేదు, బొట్టు పెట్టుకోలేదని నాకు అర్థమవుతోంది. నువ్వు వివాహితలా ప్రవర్తించకుంటే, నీ భర్త నీపై ఎందుకు ఆసక్తి చూపిస్తాడు..? ’’ అని న్యాయమూర్తి ఆ మహిళని అడిగారు. అయితే, న్యాయమూర్తుల అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి మార్గం లేకపోవడం నిరాశ పరిచిందని జహంగీర్ తన పోస్టులో పేర్కొన్నాడు.

సెషన్స్ కోర్ట్ జడ్జ్ తన క్లయింట్‌తో ‘‘ ఒక స్త్రీ బాగా సంపాదిస్తే, ఆమె ఎల్లప్పుడూ తన కంటే ఎక్కువ సంపాదిస్తున్న భర్త కోసం చూస్తుంది, తక్కువ సంపాదించే వ్యక్తిని ఎప్పుడూ కోరుకోదు. అయితే, బాగా సంపాదించే వ్యక్తి వివాహం చేసుకోవాలని అనుకుంటే, అతను తన ఇంట్లో వంట పాత్రల్ని కడిగే పనిమనిషిని కూడా వివాహం చేసుకోవచ్చు. పురుషులు ఎంత సరళంగా ఉంటారో చూడండి, మీరు కూడా కొంత సరళత చూపించాలి. కఠినంగా ఉండకండి’’ అని చెప్పినట్లు తన పోస్టులో జహంగీర్ పేర్కొన్నారు.

Exit mobile version