Site icon NTV Telugu

Delhi Mayor election: బీజేపీ వర్సెస్ ఆప్.. మేయర్ ఎన్నికలో గొడవ.. కొట్టుకున్న ఇరుపార్టీల నేతలు

Mayor Elections Delhi

Mayor Elections Delhi

AAP, BJP councillors clash inside MCD house, Delhi Mayor elections postponed: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్ ఎన్నిక బీజేపీ, ఆప్ పార్టీ మధ్య తీవ్ర గొడవకు దారి తీసింది. ఆప్, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. టేబుళ్లు, కుర్చీలు విసిరేసుకున్నారు. దీంతో మొత్తం గందరగోళంగా మారడంతో మేయర్ ఎన్నిక వాయిదా పడింది. తదుపరి నోటీసు ఇచ్చేంత వరకు ఎన్నికను వాయిదా వేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన తాత్కాలిక స్పీకర్ సత్య శర్మ, నామినేటెడ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించే సమయంలో గొడవ చెలరేగింది. ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు నినాదాలు చేస్తూ.. నామినేటెడ్ సభ్యుల కన్నా ముందుగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని తమ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ 10 మంది నామినేటెడ్ సభ్యులను నియమించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యంతరం తెలిపింది.

Read Also: Heeng: వంట గదిలో “ఇంగువ”కు ప్రత్యేక స్థానం.. ఉపయోగాలు తెలిస్తే వదలరు..

గత 15 ఏళ్లుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ను ఏలుతున్న బీజేపీకి ఈ సారి ఆప్ చెక్ పెట్టింది. అయితే ఢిల్లీలో ఓడిపోయిన బీజేపీ సహాయం చేసేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ ప్రయత్నిస్తున్నారంటూ ఆప్ ఆరోపించింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఉద్దేశపూర్వకంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న 10 మంది నామినేటెడ్ సభ్యులను ఎంపిక చేశారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా ఆరోపించారు. నామినేటెడ్ సభ్యుల పేర్లను పేర్కొన్న తర్వాత తాత్కాలిక స్పీకర్ గా సత్య శర్మను ఎల్జీ నియమించారు. అయితే ఈ పదవికి సీనియర్ మోస్ట్ కౌన్సిలర్ ముఖేష్ గోయల్ ను ఆ పదవికి ఆప్ పార్టీ సిఫార్సు చేసింది. ‘‘సభలో మోస్ట్ సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్ గా లేదా ప్రిసిడింగ్ ఆఫీసర్ గా నామినేట్ చేయడం సంప్రదాయం అయితే బీజేపీ అన్ని ప్రజాస్వామ్య సంప్రదాయాలు, సంస్థలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది’’ అని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే మేయర్ పదవిని తామే గెలుస్తామనే నమ్మకం ఆప్ లో కనిపించడం లేదని బీజేపీ విమర్శిస్తోంది. అంతా రాజ్యాంగబద్ధంగానే జరుగుతోందని.. నైతికంగా ఓడిపోయామని తెలిసి ఆప్ సాకులు వెతుకుతోందని బీజేపీ నేత మనోజ్ తివారీ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్‌ను ప్రకటించారు. బీజేపీ రేఖా గుప్తాను నిలబెట్టింది. ఢిల్లీలో మొత్తం 250 స్థానాల్లో బీజేపీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో 104 స్థానాలను గెలుచుకుంటే, ఆప్ 134 స్థానాలను కైవసం చేసుకుంది. ఢిల్లీ మున్సిపల్ చట్టం ప్రకారం.. బీజేపీకి చెందిన ఏడుగురు లోక్‌సభ ఎంపీలు, ఆప్‌కు చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు, ఢిల్లీ స్పీకర్ నామినేట్ చేసిన 14 మంది ఎమ్మెల్యేలు కూడా మేయర్ ఎన్నికలో పాల్గొంటారు. దీంతో ఢిల్లీ మేయర్ సీటుపై బీజేపీ, ఆప్ రెండు పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి.

Exit mobile version