NTV Telugu Site icon

Nitish Kumar: నితీష్‌ కుమార్ సంచలన ప్రకటన.. బీజేపీయేతర కూటమి గెలిస్తే ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా!

Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar: జేడీయూ అధినేత, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీయేతర కూటమి గెలిస్తే దేశంలోని వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. అంతేకాదు కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ప్రత్యేక కారణం లేదన్నారు. కాగా.. బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ఇటీవల తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే రాహుల్, కేజ్రీవాల్, అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి,రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఐఎన్ఎల్‌డీ నేత చౌతాలాతో చర్చలు జరిపారు. అతిత్వరలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో నితీష్ కుమార్ సమావేశం కానున్నారు. నితీశ్ ఇటీవలే బీజేపీతో దోస్తీకి గుడ్‌బై చెప్పి ఆర్జేడీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. బిహార్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నితీష్ ప్రతిపాదిస్తున్న బీజేపీయేతర కూటమిలో కాంగ్రెస్ ఉంది. స్వయంగా బిహార్‌లో ప్రస్తుతమున్న సంకీర్ణ సర్కారులో కాంగ్రెస్ కూడా ఉంది.

కాంగ్రెస్‌తో కలిసి పోరాడేందుకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిద్ధమా కాదా అనేది 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకూ స్పష్టం కాదు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి ఆయన కాంగ్రెస్ పార్టీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేసీఆర్ ఇప్పటికే తృణమూల్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్, కేరళ సీఎం విజయన్, జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, బీహార్ సీఎం నితీశ్, డిప్యూటీ సీఎం తేజస్వీ, ఆర్జేడీ అధినేత లాలూ తదితరులతో సమావేశమై చర్చలు జరిపారు.

Kishan Reddy: మోడీ సర్కార్ వారి పాట.. బహుమతుల వేలంలో వచ్చిన నిధులు నమామి గంగకే..

మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే కాంగ్రెస్ పనైపోయిందని తేల్చి చెప్పారు. దీంతో బీజేపీయేతర కూటమిలో కాంగ్రెస్ ఉండటాన్ని కేజ్రీవాల్ వ్యతిరేకిస్తున్నట్లుగా స్పష్టంగా సంకేతాలిచ్చినట్లైంది. ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ కూడా బీజేపీయేతర కూటమిలో కాంగ్రెస్ పాత్రపై ఇంకా ఏమీ స్పష్టం చేయలేదు. నితీష్ కుమార్‌ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ప్రకటన చేయగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీయేతర కూటమి వస్తే రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామంటూ గతంలో ప్రకటన చేశారు.

Show comments