భవిష్యత్తులో ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయం ఇంధనానికి మారాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నొక్కి చెప్పారు. పూణెలోని వసంతదాదా షుగర్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి షుగర్ కాన్ఫరెన్స్ 2022లో గడ్కరీ మాట్లాడారు. భవిష్యత్తులో వ్యవసాయ పరికారాల్లో కూడా ఇథనాల్ ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇంధన, విద్యుత్ రంగాల్లో అవసరాలు తీర్చేందుకు ఏటా ఇండియా రూ. 10 లక్షల కోట్ల విలువైన పెట్రోల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుందని వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో డిమాండ్ రూ. 25 లక్షల కోట్లకు కూడా పెరగవచ్చని.. దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడుతుందని నితిన్ గడ్కరీ అన్నారు.
ఇథనాల్, మిథనాల్, విద్యుత్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనమే భవిష్యత్తు అని ఆయన అన్నారు. మూడేళ్ల క్రితం నేను
ఈ -వాహనాల గురించి మాట్లాడితే ప్రజలంతా నన్ను ప్రశ్నించే వారని.. ప్రస్తుతం ఈ వాహనాలకు డిమాండ్ ఏర్పడిందని.. ప్రజలు ఈ-వాహనాల కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు.
ఎలక్ట్రిక్ స్కూటర్లు, బస్సులు, కార్లను తీసుకువచ్చామని.. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులు, ట్రాక్టర్లను కూడా తీసుకువస్తామని గడ్కరీ వెల్లడించారు. డిజిల్ ఆధారితి వ్యవసాయ పరికరాలను పెట్రోల్ ఆధారితంగా తయారు చేయాలని..ఇంజన్లను ఇథనాల్ తో పనిచేసేలా మార్చవచ్చని, నిర్మాణ సామాగ్రిలో కూడా ఇథనాల్ ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. చెక్కర ఉత్పత్తుల నుంచి ఇథనాల్ తయారు చేయాల్సిన అవసరాన్ని ఎత్తిచూపారు.
