Nipah Virus: కేరళలో మరోసారి నిపా వైరస్ కలకలం చెలరేగింది. ఇద్దరికి నిపా వైరస్ లక్షణాలు కనిపించడంతో మూడు జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం ఆరోగ్య అధికారులు కోరారు. కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్ జిల్లాల్లో ఆరోగ్య హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.
కోజికోడ్, మలప్పురం లోని ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సాధారణ పరీక్షల్లో, ఈ జిల్లాలకు చెందిన ఇద్దరిలో అనుమానిత లక్షణాలు కనిపించాయి. నిపా వైరస్ నిర్ధారణకు వారి శాంపిళ్లను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి తరలించినట్లు ప్రభుత్వం తెలిపింది. “నిపా ప్రోటోకాల్‌కు అనుగుణంగా నివారణ చర్యలను మేము ఇప్పటికే బలోపేతం చేసాము” అని పరిస్థితిని అంచనా వేయడానికి అత్యవసర సమావేశానికి అధ్యక్షత వహించిన తర్వాత ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అన్నారు.
Read Also: Marathi Row: ‘‘మరాఠీ’’ పేరుతో గుండాయిజాన్ని సహించను.. ఠాక్రేలకు సీఎం వార్నింగ్..
కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్ జిల్లాల్లో కాంటక్ట్ ట్రేసింగ్ నిర్వహించడానికి, లక్షణాలను పర్యవేక్షించడానికి, ప్రజలకు తెలియజేయడానికి ప్రతీ ప్రాంతంలో 26 ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. కంటైన్మెంట్ జోన్‌లను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలకు సాయం చేయడానికి హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల వారాల్లో ఏదైనా అసహజ మరణాలు సంభవించాయా..? అని అధికారులు ఆరా తీస్తున్నారు.