Site icon NTV Telugu

Hardeep Singh Nijjar: కెనడా రాజకీయ నాయకుడికి ఖలిస్తానీ నిజ్జర్ నుంచి నిధులు..

Jagmeet Singh, Nijjar

Jagmeet Singh, Nijjar

Hardeep Singh Nijjar: ఖలిస్తానీ ఉగ్రవాదులకు, కొందరు కెనడాలోని రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయని మనదేశం చాలా సార్లు చెప్పింది. అయితే కొన్ని ఓట్ల కోసం కెనడాలోని రాజకీయ నాయకులు ఖలిస్తానీ వర్గాలను పెంచిపోషిస్తున్నాయి. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పటికీ, అక్కడి జస్టిస్ ట్రూడో ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పలుమార్లు భారత్ తన నిరసనను తెలియజేసినప్పటికీ కెనడా పెద్దగా చర్యలు తీసుకోలేదు.

ఇదిలా ఉంటే ఖలిస్తానీ ఉగ్రవాది, మరణించిన హర్దీప్ సింగ్ నిజ్జర్ నుంచి కెనడా రాజకీయ నాయకుడు, న్యూ డెమోక్రటిక్ పార్టీ(ఎన్డీపీ) నేత జగ్మీత్ సింగ్ నిధులు తీసుకున్నట్లు ఇటీవల ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ మోచా బెజిర్గాన్ ఈ వారం సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో ఒక కథనంలో వెల్లడించారు. ఖలిస్తానీ సానుభూతిపరుడిగా ఉన్న జగ్మీత్ సింగ్ 2017లో నిజ్జర్ నుంచి విరాళాలు అందుకున్నాడు.

Read Also: Baba Vanga Predictions: “ఏలియన్స్, ప్రపంచం అంతం”.. భయపెడుతున్న బాబా వంగ జోస్యం..

భారత్ చేత ఉగ్రవాదిగా గుర్తించబడిని హర్డీప్ సింగ్ నిజ్జర్ 2023, జూన్ నెలలో బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలోని గురుద్వారా ముందు కాల్చి చంపబడ్డాడు. ఈ కేసులో పలువురిని కెనడియన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని, ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించడం ఆ సమయంలో సంచలనంగా మారింది. అయితే, భారత్ అంతే ధీటుగా కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారింది, కెనడా చేసిన ఆరోపణలు అసంబద్ధ, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా చెప్పింది. నిజ్జర్ హత్య ఇరు దేశాల మధ్య దౌత్యవివాదానికి కారణమైంది.

జర్నలిస్ట్ బెజిర్గాన్ ప్రకారం.. ఎలక్షన్ కెనడా రికార్డులు V3W 0J4 పోస్టల్ కోడ్‌తో 2017లో జగ్మీత్ సింగ్‌కి విరాళం ఇచ్చినట్లు చూపించాయి. ఈ పోస్టల్ కోడ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ ప్లంబింగ్ కంపెనీ అయిన నిజ్జర్ ప్లంబింగ్ అండ్ హీటింగ్ లిమిటెడ్‌తో సంబంధం ఉన్నట్లు తేలింది. లింక్డ్‌ఇన్ రికార్డుల ప్రకారం, నిజ్జర్ కుమారుడు మెహతాబ్ నిజ్జర్ అక్కడ పనిచేస్తున్నాడు. ఈ విరాళం అనేది, ఖలిస్తానీ ఉగ్రవాదులు, కెనడా రాజకీయ నాయకులు కలిసి పనిచేస్తున్నారని సూచించడానికి ముఖ్యమైన సాక్ష్యంగా ఉంది.

Exit mobile version