Pahalgam Terror Attack Case: పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా (LeT) వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను పహల్గామ్ ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) కోర్టు సమన్లు పంపడానికి సిద్ధమవుతోంది. 2025లో జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో కీలక నిందితుడిగా సయీద్‌ను చేర్చిన నేపథ్యంలో చర్యలకు సిద్ధమైంది. ఈ సమన్లను విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) ద్వారా హఫీజ్ సయీద్‌కు పంపనున్నారు. జమ్మూలోని ప్రత్యేక NIA కోర్టు ఎదుట విచారణకు హాజరుకావాలని సమన్లలో ఆదేశించనున్నారు.
ఇదిలా ఉంటే, ఇప్పటికే హఫీజ్ సయీద్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ దాడికి సూత్రధారుల్లో ఒకరిగా ఇతను ఉన్నట్లు ఎన్ఐఏ ఆరోపించింది. జూలైలో దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌లో సయీద్‌ను ఎన్ఐఏ నిందితుడి పేర్కొంది. నిషేధిత లష్కరే తోయిబా, దాని ప్రాక్సీ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) అధిపతిగా మాత్రమే కాకుండా, వ్యక్తిగత హోదాలో అతడిని నిందితుడి చేర్చింది. సయీద్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS)-2023, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), 1967 కింద అభియోగాలు నమోదయ్యాయి. భారత్‌పై యుద్ధం చేయడం, పాకిస్థాన్ నుంచి దాడికి కుట్ర పన్నడం వంటి ఆరోపణలు ఉన్నాయి. NIA గతంలో దాఖలు చేసిన 1,597 పేజీల ఛార్జ్‌షీట్‌కు కొనసాగింపుగా ఈ అనుబంధ ఛార్జ్‌షీట్‌ను సమర్పించింది.
పాకిస్తాన్ కేంద్రంగా కుట్ర జరిగినట్లు, హఫీజ్ సయీద్ పాత్ర, దర్యాప్తులో సేకరించిన ఆధారాల వివరాలను NIA ఛార్జిషీట్‌లో పొందుపరిచింది. పాకిస్తాన్‌కు చెందిన అనుమానిత హ్యాండర్లు సజిద్ జట్, 2025 జూలైలో ఆపరేషన్ మహాదేవ్‌లో హతమైన ముగ్గుర ఉగ్రవాదులు, అరెస్టైన ఇద్దరు నిందితులను NIA ఛార్జిషీట్‌లో పేర్కొంది. దాడి ప్రణాళిక, సహకారం, అమలులో పాత్ర ఉందనే ఆరోపణలతో లష్కరే తోయిబాను కూడా ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.
2025 ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఈ ఉగ్రదాడి జరిగింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్లాన్ ప్రకారం పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకుని 25 మందిని చంపారు. ఈ దాడిపై ముందుగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దర్యాప్తును NIAకి అప్పగించింది. ఈ కేసులో హఫీజ్ సయీద్‌కు సంబంధించిన చట్టపరమైన చర్యలు పూర్తైన తర్వాత కూడా కోర్టుకు హాజరుకాకుంటే, బీఎన్ఎస్ సెక్షన్ 356 కింద అతడిని పరారీలో ఉన్న నిందితుడిగా చూపిస్తూ కోర్టు విచారణ కొనసాగించే అవకాశం ఉంది.

