Nepal: హిమాలయ దేశం నేపాల్‌లో ప్రజా ఉద్యమం ఎగిసిపడుతోంది. రాజ్యాంగబద్ధమైన రాచరికంతో పాటు హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ఖాట్మాండులో వేలాదిగా ప్రజలు మార్చ్ నిర్వహించారు. ఈ ఆందోళనల్ని పోలీసులు అర్డుకున్నారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. దశాబ్ధకాలంగా 16,000 మందికి పైగా ప్రజలు మరణించిన తర్వాత అంతర్యుద్ధానికి ముగింపు పిలికి శాంతి ఒప్పందంలో భాగంగా ఆ దేశంలో పార్లమెంట్ రాచరికాన్ని రద్దు చేశారు. 2008లో హిందూ మెజారిటీగా ఉన్న దేశం సమాఖ్య వ్యవస్థతో లౌకిక రాజ్యంగా అవతరించింది.
అయితే, దేశంలో రాచరికాన్ని పునరుద్ధరించాలని, హిందూ దేశంగా మార్చాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సమాఖ్య వ్యవస్థను రద్దు చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. నేపాల్ పార్లమెంట్‌లో ఐదో అతిపెద్ద పార్టీగా ఉన్న రాష్ట్రీ ప్రజాతంత్ర పార్టీ ఈ డిమాండ్లను చేస్తోంది. ‘‘మన దేశం, మన రాజు మాకు ప్రాణం కన్నా ప్రియమైనవారు’’ అంటూ నిరసనకారులు రాజధానిలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. నిరసనకారులు నిషేధిత ప్రాంతంలోకి చొరబడిన తర్వాత వారిని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ఉఫయోగించినట్లు పోలీస్ అధికార ప్రతినిధి నవరాజ్ తెలిపారు.
నేపాల్‌లో రాజకీయ అస్థిరత, అవినీతి, ఆర్థికాభివృద్ధి నెమ్మది కావడంతో ఆ దేశంలోని ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. దీంతో రాజరికం కావాలని, హిందూ రాజ్యపునరుద్ధరణ జరగాలని మద్దతు పెరుగుతోంది. అధికారంలో ఉన్న వారు అవినీతి, అన్యాయంతో తమ దేశాన్ని నాశనం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. మన గుర్తింపు, సంస్కృతిని కాపాడటానికి రాజరికాన్ని పునరుద్ధరించడం కంటే వేరే మార్గం లేదని నిరసనకారులు చెబుతున్నారు.
2001లో నేపాల్ యువరాజు దీపేంద్ర అతని తండ్రి రాజైన బీరేంద్రతో పాటు 10 మందిని ఊచకోత కోశాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ తరువాత పరిణామాల్లతో రాజుగా జ్ఞానేంద్ర షా ప్రకటించబడ్డాడు. 76 ఏళ్ల ఈయన నేపాల్‌కి చివరి రాజు. అయితే, ఇతను నేపాల్ రాజకీయాలపై పెద్దగా వ్యాఖ్యానాలు చేయకుండా దూరంగా ఉన్నారు. రాచరికం పునరుద్ధరణకు పిలుపునిచ్చారు.