NEET Exam: అబుదాబి సెంటర్ ఇవ్వడంపై రాహుల్‌గాంధీ ఫైర్.. ఎన్‌టీఏ క్లారిటీ

  • రేపే నీట్ పరీక్ష
  • అబుదాబి సెంటర్ ఇవ్వడంపై రాహుల్‌గాంధీ ఫైర్
  • జాతీయ పరీక్షల సంస్థ వివరణ
  • అభ్యర్థి తండ్రి సంతృప్తి
Rahulgandhi

Rahulgandhi

ఆదివారం జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్‌కు ముందు మరోసారి రాజకీయ వివాదం చెలరేగింది. పాస్‌పోర్ట్‌ లేని అభ్యర్థికి అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ ఎలా ఇస్తారని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నిలదీశారు. ఎన్‌టీఏ వైఫల్యం అంటూ ధ్వజమెత్తారు. తాజాగా ఈ వ్యవహారంపై ఎన్‌టీఏ క్లారిటీ ఇచ్చింది.

నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన పరీక్షా కేంద్రం కేటాయింపుపై నెలకొన్న వివాదానికి జాతీయ పరీక్షల సంస్థ (NTA) వివరణ ఇచ్చింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ విద్యార్థికి పరీక్షా కేంద్రంగా అబుదాబి కేటాయించడంపై విమర్శలు రావడంతో స్పందించింది. అభ్యర్థి లాగిన్ ద్వారానే పరీక్షా నగరాన్ని అబుదాబిగా మార్చినట్లు తెలిపింది. అయితే విద్యార్థి అభ్యర్థన మేరకు తాజాగా నాగ్‌పూర్‌లోనే పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తూ కొత్త అడ్మిట్ కార్డును జారీ చేసినట్లు వెల్లడించింది.

×
×
Ad

నీట్-యూజీ పరీక్ష వాయిదా పడిన తర్వాత జూన్ 21న నిర్వహించనున్న రీ-ఎగ్జామ్ కోసం ఎన్‌టీఏ పరీక్షా నగరాల సవరణకు అవకాశం కల్పించింది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా సుమారు 3.2 లక్షల మంది అభ్యర్థులు తమ పరీక్షా నగరాల ఎంపికలను సవరించుకున్నారని.. వారిలో 99.5 శాతం మందికి వారు కోరుకున్న నగరాల్లోనే పరీక్షా కేంద్రాలు కేటాయించినట్లు ఎన్‌టీఏ పేర్కొంది. అయితే నాగ్‌పూర్‌కు చెందిన విద్యార్థి విషయంలో పరీక్షా నగరాన్ని అబుదాబిగా మార్చిన చర్య అభ్యర్థి అధికారిక లాగిన్ ద్వారానే జరిగినట్లు వెబ్ యాక్టివిటీ రికార్డులు సూచిస్తున్నాయని ఎన్‌టీఏ వెల్లడించింది. ఒకే యూజర్ యాక్సెస్ ద్వారా ఈ మార్పు జరిగిందని.. తర్వాత అదే ఖాతా ద్వారా రెండు సార్లు కేంద్ర వివరాలు కూడా పరిశీలించినట్లు తెలిపింది.

అయితే పరీక్షకు రెండు రోజుల ముందు.. అనగా జూన్ 19 సాయంత్రం విద్యార్థి తరఫున నాగ్‌పూర్‌లో పరీక్షా కేంద్రం ఇవ్వాలని అనధికారిక అభ్యర్థన అందిందని ఎన్‌టీఏ పేర్కొంది. వెంటనే స్పందించిన అధికారులు అదే రోజు విద్యార్థి తండ్రిని సంప్రదించి అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి పరీక్షా కేంద్రాన్ని మార్చినట్లు వివరించింది.

రాహుల్ గాంధీ విమర్శలతో..

ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. పాస్‌పోర్ట్ కూడా లేని విద్యార్థికి విదేశీ పరీక్షా కేంద్రం కేటాయించడం పరీక్షా వ్యవస్థ వైఫల్యానికి ఉదాహరణ అని విమర్శించారు. దీనిపై స్పందించిన ఎన్‌టీఏ.. తమ విధానం పూర్తిగా ‘స్టూడెంట్ ఫస్ట్’ సూత్రంపై ఆధారపడి ఉంటుందని.. ఎలాంటి పరిపాలనా సమస్యల వల్లా ఒక్క అభ్యర్థి కూడా పరీక్షకు దూరం కాకూడదనేదే తమ లక్ష్యమని స్పష్టం చేసింది.

ఇక విద్యార్థి తండ్రి కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘కొద్ది నిమిషాల క్రితమే నాగ్‌పూర్‌లోని మెడికల్ కాలేజీని పరీక్షా కేంద్రంగా చూపిస్తూ కొత్త అడ్మిట్ కార్డు అందింది. ఎన్‌టీఏ వేగంగా స్పందించినందుకు కృతజ్ఞతలు. ఈ సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన మీడియాకు కూడా ధన్యవాదాలు. నా కుమారుడు అబ్దుల్లా మళ్లీ పరీక్ష రాయడానికి సిద్ధంగా లేకపోయినా… మేము అతడిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం.’’ అని తెలిపారు. ఈ పరిణామంతో వివాదానికి తాత్కాలికంగా ముగింపు పలికినట్లు కనిపిస్తున్నప్పటికీ.. నీట్ రీ-ఎగ్జామ్ నిర్వహణపై దేశవ్యాప్తంగా ఆసక్తి కొనసాగుతోంది. రేపటి పరీక్షపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కోట్లాది కళ్లు నీట్ పరీక్షపైనే ఫోకస్ అయ్యాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి.