NTV Telugu Site icon

Rajasthan: అంగన్వాడీ ఉద్యోగాల సాకుతో 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారం..

Sirohi Incident

Sirohi Incident

Rajasthan: రాజస్థాన్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామనే సాకుతో ఇద్దరు వ్యక్తులు 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రంలోని సిరోహిలో జరిగింది. ఈ ఉదంతంలో ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. మున్సిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ మహేంద్ర మేవాడా, మాజీ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ మహేంద్ర చౌదరిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులుగా గుర్తించారు.

Read Also: BRS Balka Suman: సీఎం రేవంత్ పై కామెంట్స్.. బాల్క సుమన్ కు నోటీసులు

అంగన్వాడీల్లో ఉపాధి కల్పిస్తామనే నెపంతో దాదాపు 20 మంది మహిళలపై ఇద్దరు నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పాలీ జిల్లాకు చెందిన ఓ మహిళ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తనతో పాటు ఉద్యోగవకాశాలు కల్పిస్తామని దాదాపుగా 20 మంది మహిళల్ని మోసగించారని ఆమె ఫిర్యాదు చేసింది.

నిందితులు లైంగిక వేధింపులను చిత్రీకరించి, ఆ ఫుటేజీని సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించే వారని, బాధితుల నుంచి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసే వారని, ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు బాధిత మహిళ ఆరోపించింది. మహిళ చెప్పిన వివరాల ప్రకారం.. తనతో కలిసి కొందరు మహిళలు అంగన్వాడీలో పనిచేసేందుకు సిరోహి వెళ్లినట్లు, వారికి నిందితులు వసతి, భోజన సదుపాయాలు కల్పించారని, వారు వడ్డించిన భోజనంలో మత్తుమందు కలిపి, తిన్న తర్వాత మత్తులో జారుకున్నాక లైంగిక వేధింపులకు పాల్పడే వారని ఆమె ఆరోపించింది. స్పృహలోకి వచ్చిన తరువాత తమపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసిందని, మహిళలు గతంలో తప్పుడు ఫిర్యాదు చేశారని డీఎస్పీ పరాస్ చౌదరి తెలిపిన క్రమంలో ప్రస్తుతం 8 మంది మహిళల పిటిషన్‌పై కేసు నమోదు చేయాలని రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది.