Site icon NTV Telugu

Bangladesh Protests: బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు 1000 మంది విద్యార్థులు.. చిక్కుకుపోయిన 4000 మంది..

Bangladesh Protests

Bangladesh Protests

Bangladesh Protests: బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లపై జరగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటయోధుల కుటుంబాలకు చెందిన వారికి 30 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ, పలు వర్సిటీల విద్యార్థులు, ప్రజలు నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ రిజర్వేషన్లు ఎత్తేసి మెరిట్ ఉన్న విద్యార్థులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ హింసలో దాదాపుగా 115 మంది మరణించారు. ప్రస్తుతం షేక్ హసీనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూని విధించింది. నిరసనల్ని అణిచివేయడానికి ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది. కర్ఫ్యూ ఆదివారం ఉదయం 10 గంటల వరకు ఉంటుందని సైన్యం ప్రకటించింది.

Read Also: Chirag Paswan: యూనిఫాం సివిల్‌ కోడ్‌ పై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు..మద్దతు ఇవ్వను..!

ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌లో హింసాత్మక పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి వస్తున్నారు. ఢాకాలోని భారత హైకమిషన్ భారత్-బంగ్లాదేశ్ వద్ద అంతర్జాతీయ సరిహద్దును దాటేందుకు వారి ప్రయాణాన్ని సులభతరం చేస్తోంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) పౌర విమానయానం, ఇమ్మిగ్రేషన్, ల్యాండ్ పోర్ట్‌లు మరియు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)తో కూడా భారతీయ పౌరులకు సాఫీగా వెళ్లేందుకు సహకరిస్తోంది. ఇప్పటి వరకు 778 మంది భారతీయులు భూమార్గం ద్వారా, 200 మంది విద్యార్థుల వరకు ఢాకా, చిట్టగాంగ్ విమానాశ్రయాల ద్వారా భారత్ చేరినట్లు విదేశాంగ ప్రకటించింది.

ఇదిలా ఉంటే బంగ్లాదేశ్‌లోని వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటున్న మరో 4000 మంది భారతీయలు అక్కడే చిక్కుకుపోయారు. వీరితో భారత హైకమిషన్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది. నేపాల్, భూటాన్ అభ్యర్థన మేరకు ఆ దేశాలకు చెందిన విద్యార్థులను కూడా భారత్‌లోకి ప్రవేశించేందుకు సహాయం చేస్తున్నారు. అయితే, చాలా మంది విద్యార్థులు భారత్ రావడానికి విమాన టిక్కెట్లు బుక్ చేసుకున్నప్పటికీ, కర్ఫ్యూ ఉండటంతో వారు బయటకు రాలేని పరిస్తితి ఏర్పడింది. యూనివర్సిటీ హాస్టళ్లలోనే విద్యార్థులు ఉన్నారు. అక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉన్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఢాకాలోని హైకమిషన్ బంగ్లాదేశ్ పౌర విమానయాన అధికారులు మరియు వాణిజ్య విమానయాన సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఢాకా మరియు చిట్టగాంగ్ నుండి భారతదేశానికి అంతరాయం లేకుండా విమాన సేవలను అందిస్తోంది.

Exit mobile version