Site icon NTV Telugu

Aryan Khan: ఎన్సీబీ వెల్లడించిన సంచలన నిజాలు.. అమెరికాలోనే స్టార్ట్

Ncb Reveals Aryan Khan Facts

Ncb Reveals Aryan Khan Facts

సంచలనం సృష్టించిన క్రూజ్ నౌక డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ పొందిన బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గురించి ఎన్సీబీ తాజాగా సంచలన విషయాలు బయటపెట్టింది. అమెరికాలో తాను గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పటి నుంచే గంజాయి తాగడం మొదలుపెట్టినట్టు స్వయంగా ఆర్యన్ అంగీకరించినట్టు ఎన్సీబీ తెలిపింది. ఆ సమయంలో తాను నిద్ర సంబంధిత సమస్యలతో బాధపడేవాడినని, గంజాయితో ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఇంటర్నెట్‌లో చూసిన తర్వాతే తాను దాన్ని తీసుకోవడం ప్రారంభించానని ఆర్యన్ వెల్లడించినట్టు ఎన్సీబీ తన అభియోగపత్రంలో పేర్కొంది.

అయితే.. వినోదం కోసం లాస్ ఏంజెలెస్‌లో మరిజువానా తీసుకున్నానని, మాదకద్రవ్యాల గురించి తన ఫోన్‌లో వాట్సప్ ద్వారా చాట్ చేసింది కూడా తానేనని ఆర్యన్ ఒప్పుకున్నాడు. ముంబైలోని బాంద్రాలో తనకో డ్రగ్ డీల్ తెలుసని చెప్పిన ఆర్యన్.. అతని పేరు, చిరునామా మాత్రం పూర్తిస్థాయిలో తెలియదన్నాడు. ‘డోఖా’ పేరుతో మాదకద్రవ్యాల కొనుగోలు కోసం వాట్సప్‌లో చాట్ చేసినట్లు వెల్లడించాడు. అయితే.. క్రూజ్ నౌకపై దొరికిన మాదకద్రవ్యాలతో తనకెలాంటి సంబంధం లేదని ఆర్యన్ తెలిపినట్టు ఆ అభియోగపత్రంలో ఉంది. అంతేకాదు.. ఈ కేసులో క్లీన్ చిట్ పొందిన అర్బాజ్ మర్చంట్ సైతం, తనని క్రూజ్ నౌకలో డ్రగ్స్ తీసుకురావొద్దని ఆర్యన్ ముందుగానే హెచ్చరించినట్టు పేర్కొన్నాడు. డ్రగ్స్ గురించి అనన్యా పాండేతో 2019లో చాట్ చేసిన విషయం వాస్తవమేనని ఆర్యన్ ఒప్పుకోగా, అది కేవలం సరదా కోసమేనని అనన్యా క్లారిటీ ఇచ్చింది.

మరోవైపు.. ఈ కేసు నుంచి ఆర్యన్‌ని విడిపించేందుకు షారుఖ్ నుంచి రూ. 25 కోట్లు అధికారులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఎన్సీబీ స్పష్టం చేసింది. తమకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని క్లారిటీ ఇచ్చింది. రూ. 25 కోట్లు డిమాండ్ చేసి, చివరికి రూ. 18 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారని.. అందులో రూ. 8 కోట్లు అప్పటి ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ అయిన సమీర్ వాంఖడేకి ఇవ్వాల్సి ఉంటుందని సామ్ డిసౌజ్ వ్యక్తితో తన యజమాని కేపీ గోసావి చెప్పడం చూశానని ప్రభాకర్ సాయిల్ అనే సాక్షి అప్పట్లో పేర్కొన్నాడు. దీనిపై దర్యాప్తు చేయగా.. ఆరోపణల్ని నిర్ధారించే సాక్ష్యాలేవీ లేవని ఎన్సీబీ నిర్ధారించింది. కాగా.. సాయిల్ ఈ ఏడాది ఏప్రిల్‌లో గుండెపోటుతో మరణించాడు.

Exit mobile version