NTV Telugu Site icon

Omar Abdullah: ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టేందుకే జమిలి ఎన్నికలు..

Omar Abdullah

Omar Abdullah

Omar Abdullah: కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు పిలుపునివ్వడం, ఆ సమావేశాల్లో ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ బిల్లు పెడతారనే అంశం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు సమావేశాలకు పిలుపునిచ్చిన తర్వాతి రోజే కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షుడిగా 8 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. దీంతో కేంద్రంలోని బీజేపీ జమిలి ఎన్నికలకు వెళ్లవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే దీనిపై ప్రతిపక్ష పార్టీలు విరుచుకుపడుతున్నాయి.

Read Also: Oil Palm Cultivation: ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలను పొందుతున్న రైతులు..

తాజాగా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా స్పందించారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ ఉద్దేశం ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టడమే అని.. దాన్ని ఎలా సమర్థిస్తామని ఆయన ప్రశ్నించారు. నిజంగా దీని ఉద్దేశం ఎన్నికల్ని సరళీకృతం చేయడమైతే ఏం సమస్య లేదని అన్నారు. ఇప్పుడు ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అన్నారు, తర్వాత ‘వన్ నేషన్ నో ఎలక్షన్’ అంటారని వ్యాఖ్యానించారు.

అంతకుముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ గురించి మాట్లాడుతూ.. ఇది భారతీయ యూనియన్, రాష్ట్రాలపై దాడిగా అభివర్ణించారు. ఇండియా కూటమిలోని నేతలు మమతా బెనర్జీ, నితీష్ కుమార్ వంటి వారు దీన్ని వ్యతిరేకించగా.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దీన్ని స్వాగతించారు. జమిలి ఎన్నిలతో ఖర్చు తగ్గుతుందని, మిగిలిన డబ్బును అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగించవచ్చనే అభిప్రాయాన్ని వెల్లడించారు.