NTV Telugu Site icon

Delhi rain: ఢిల్లీలో మరోసారి భారీ వర్షం.. ట్రాఫిక్‌కు అంతరాయం

Raib

Raib

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. గత రెండ్రోజులగా కుండపోత వర్షం కురవడంతో నగరం గజగజ వణికిపోయింది. రోడ్లు చెరువులను తలపించాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. రాకపోకలు జరిగించని పరిస్థితులు ఏర్పాడ్డాయి. సామాన్యుల నుంచి మంత్రులు, ఎంపీల వరకు అందరూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత 88 ఏళ్లలో కురిసిన వర్షం.. తిరిగి గత రెండ్రోజుల్లో కురిసి రికార్డ్ సృష్టించింది. కేంద్ర వాతావరణ శాఖ అంచనాలు కూడా తలకిందులయ్యాయి. దాదాపు 24 గంటల్లో 228 మి.మీ.ల వర్షపాతం నమోదైనట్లుగా ఐఎండీ తెలిపింది. ఇదిలా ఉంటే ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్-1 పైకప్పు కూలి ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. విద్యుత్ షాక్.. గోడ కూలి మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం హస్తిన వాసులు తిరిగి కోలుకుంటుండగా.. మరోసారి శనివారం మధ్యాహ్నం నుంచి పలుచోట్లు భారీ వర్షం కురుస్తుంది. దీంతో వాహనాలు నిలిచిపోవడం వాహనదారులు ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

ఇది కూడా చదవండి: Instagram Down: ఒక్కసారిగా నిలిచి పోయిన ఇన్‌స్టాగ్రామ్ సేవలు! అసలేం జరిగింది?

మాన్‌సింగ్ రోడ్, శాస్త్రి భవన్, ఫిరోజ్ షో రోడ్డులో భారీ వర్షం కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సహాయ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నారు. గత కొద్ది రోజులుగా వేడి గాలులతో.. నీటి ఎద్దడితో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా విస్తారంగా వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడి ప్రజలు చల్లని గాలులతో ఉపశమనం పొందుతున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Meera Nandan: గుడిలో ప్రియుడిని పెళ్లాడిన తెలుగు హీరోయిన్