Site icon NTV Telugu

Rajiv Gandhi: దేశ రాజకీయచరిత్రలో ధృవతార

Rajiv1

Rajiv1

మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి ఇవాళ. జాతీయ ఉగ్రవాద వ్యతిరేకదినంగా ఈరోజుని జాతియావత్తూ జరుపుకుంటోంది. రాజీవ్ గాంధీ 1991, మే 21న హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజీవ్ గాంధీ దేశమంతా విస్తృతంగా తిరగుతున్నారు. చెన్నైకు సమీపంలో ఉన్న శ్రీ పెరంబదూర్ కు రాజీవ్ గాంధీ మే 21న ఎన్నికల ప్రచారం కోసం వెళ్లారు. రాత్రి ఎనిమిదిన్నర సమయంలో ఎల్ టీటీఈకి చెందిన థాను, శివరాజన్, హరిబాబు తదితరులు అప్పటికే రాజీవ్ గాంధీను హత్య చేసేందుకు అక్కడ సిద్ధంగా ఉన్నారు. థాను రాజీవ్ గాంధీ కాళ్లకు నమస్కరించేందుకు వంగి… ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో రాజీవ్ గాంధీ, థానుతో కలిపి మొత్తం 14 మంది మరణించారు.

ఇందిరాగాంధీ తనయుడిగా, నెహ్రూ మనవడిగా రాజీవ్ గాంధీ తనదైన ముద్రవేశారుజ. 40 ఏళ్ళ వ‌య‌సులో భార‌త యువ ప్రధానిగా బాధ్యత‌లు చేప‌ట్టిన రాజీవ్‌గాంధీ బ‌హుశా ప్రపంచంలోనే అతి పిన్నవ‌య‌స్కులైన ప్రభుత్వాధినేత‌ల్లో ఒక‌రయ్యారు. ఆయ‌న త‌ల్లి ఇందిరాగాంధీ 1966లో మొద‌టిసారి ప్రధాన‌మంత్రి అయిన‌ప్పుడు ఆమె రాజీవ్ గాంధీ కంటే 8 ఏళ్ళు (48) పెద్ద ప్రఖ్యాతివ‌హించిన‌ ఆయ‌న తాత పండిట్ జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ స్వేచ్ఛా భార‌తానికి తొలి ప్రధానిగా బాధ్యత‌లు చేప‌ట్టేనాటికి వ‌య‌సు 58 సంవ‌త్సరాలు. హ‌త్యకు గురైన త‌న త‌ల్లి అంత్యక్రియ‌లు పూర్తికాగానే ఆయ‌న లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు వెళ్లారు.

ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అంత‌కుముందు 7 సార్లు జ‌రిగిన ఎన్నిక‌లలో కంటే అత్యధిక ఓట్లను సాధించింది. 508 లోక్‌స‌భ సీట్లలో రికార్డుస్థాయిలో 401 సీట్లు గెలుచుకుంది. 7 కోట్ల మంది భార‌తీయుల‌కు నాయ‌కునిగా అటువంటి శుభారంభం చేయ‌డం అది ఎటువంటి ప‌రిస్థితి అయినా చెప్పుకోద‌గిందే. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే రాజీవ్‌గాంధీ పూర్తిగా రాజ‌కీయ కుటుంబానికి చెందినవారు అయిన‌ప్పటికీ ఆల‌స్యంగా, అయిష్టంగా రాజ‌కీయాల్లో ప్రవేశించి కూడా ఇంత పెద్ద మెజార్టీ సాధించ‌డం, స్వాతంత్ర ఉద్యమంలోను, ఆ త‌రువాత 4 త‌రాలపాటు భార‌త‌దేశానికి సేవ‌లు అందించిన రాజ‌కీయ కుటుంబానికి చెందిన రాజీవ్‌గాంధీ అనివార్య ప‌రిస్థితుల్లోనే రాజ‌కీయ ప్రవేశం చేశారు.

రాజీవ్‌గాంధీ 1944 ఆగ‌స్టు 20 బాంబేలో జ‌న్మించారు. భార‌త‌దేశం స్వాతంత్య్రం సాధించేనాటికి ఆయ‌న తాత ప్రధాన‌మంత్రి అయ్యేనాటికి రాజీవ్ వ‌య‌సు కేవ‌లం 3 సంవ‌త్సరాలు. ఆయ‌న త‌ల్లిదండ్రులు ల‌క్నో నుంచి ఢిల్లీకి మ‌కాం మార్చారు. తండ్రి ఫిరోజ్ గాంధీ పార్లమెంటు స‌భ్యుడయ్యారు. ప‌నిచేసే పార్లమెంటేరియ‌న్‌గా పేరు తెచ్చుకున్నారు. రాజీవ్‌గాంధీ త‌న బాల్యాన్ని తాత‌గారితో క‌ల‌సి తీన్‌మూర్తి హౌస్‌లో గ‌డిపారు. అక్కడ ఇంధిరాగాంధీ ప్రధాన‌మంత్రి స‌హాయ‌కురాలిగా ప‌నిచేశారు. డెహ్రాడూన్‌లోని వెల్హామ్ ప్రెప్ స్కూల్‌కు కొద్దికాలంపాటు వెళ్ళిన రాజీవ్‌గాంధీ త‌రువాత రెసిడెన్షియ‌ల్ డూన్ స్కూల్‌కు మారారు. అక్కడ ఆయ‌న అనేక మందితో అనుబంధాన్ని పెంచుకున్నారు. చిన్నత‌మ్ముడు సంజ‌య్‌గాంధీ కూడా ఆయ‌న‌తో క‌లిశారు.

రాహుల్ గాంధీ ఎమోషనల్ ట్వీట్

రాజీవ్‌ గాంధీ వర్థంతి నేపథ్యంలో ట్విట్టర్‌లో రాహుల్‌ గాంధీ ఎమోషనల్‌ ట్వీట్‌ పోస్ట్‌ చేశారు. ‘మా నాన్న దూరదృష్టి గల నాయకుడు.. ఆయన విధానాలు ఆధునిక భారతదేశాన్ని రూపొందించడంలో సహాయపడ్డాయి. అతను కరుణ మరియు దయగల వ్యక్తి మరియు నాకు, ప్రియాంకకు అద్భుతమైన తండ్రి, క్షమాపణ మరియు సానుభూతి యొక్క విలువను మాకు నేర్పించారు. నేను నాన్నను చాలా మిస్ అవుతున్నాను మరియు మేము కలిసి గడిపిన సమయాన్ని ప్రేమగా గుర్తుంచుకుంటాను.’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

స్కూల్ చ‌దువు పూర్తయిన త‌రువాత రాజీవ్‌గాంధీ కేంబ్రిడ్జి ట్రినిటీ క‌ళాశాల‌లో చేరారు. అయితే త్వ‌ర‌లోనే లండ‌న్‌లోని ఇంపీరియ‌ల్ కాలేజ్‌కి మారారు. అక్క‌డ మెకానిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సు చేశారు. రాజకీయాల్లోకి రావాలని రాజీవ్ గాంధీ ఎప్పుడూ అనుకోలేదంటారు. ఆస‌క్తి కూడా చూప‌లేదు. సైన్సు, ఇంజినీరింగ్‌కు సంబంధించిన అనేక ఉద్గ్రంధాలు ఆయ‌న బీరువాల నిండా ఉండేవ‌ని రాజీవ్ స‌హ విద్యార్ధులు చెబుతారు. ఫిలాస‌ఫీ, రాజ‌కీయాలు లేదా చ‌రిత్ర గురించి ఆయ‌న ప‌ట్టించుకునేవారు కాదు. అయితే సంగీతాన్ని ఇష్టప‌డేవారు. రాజీవ్ ఆస‌క్తి క‌న‌బ‌రిచే ఇత‌ర అంశాల్లో ఫొటోగ్రఫీ, అమెచ్యూర్ రేడియో ముఖ్యమైన‌వి.

కాగా, రాజీవ్‌కు అత్యంత ఇష్టమైన‌వి గాల్లో ప్రయాణించ‌డం. ఇంగ్లండ్ నుంచి తిరిగివ‌చ్చిన వెంట‌నే ఢిల్లీ ఫ్లైయింగ్ క్లబ్ ఎంట్రన్స్ ప‌రీక్ష పాసై క‌మ‌ర్షియ‌ల్ పైలట్ లైసెన్సు తీసుకోవ‌డానికి వెళ్ళారు. అన‌తికాలంలోనే దేశీ విమాన సంస్థ ఇండియ‌న్ ఎయిర్‌లైన్స్‌ లో పైలట్ జీవితం ప్రారంభించారు. కేంబ్రిడ్జ్ లో ఉన్న స‌మ‌యంలో ఇంగ్లీష్ చ‌దివే ఇటాలియ‌న్ మ‌హిళ సోనియా మైనోతో ఆయ‌న‌కు ప‌రిచ‌య‌మ‌యింది. 1968లో ఢిల్లీలో వారు ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరు పిల్ల‌లు రాహుల్‌, ప్రియాంక‌తో క‌ల‌సి వారు ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంట్లో నివాసం ఉన్నారు.

1980లో సోద‌రుడు సంజ‌య్‌గాంధీ విమాన ప్రమాదంలో మ‌ర‌ణించాడు. అప్పట్లో అంత‌ర్గతంగా, బ‌హిర్గతంగా అనేక స‌వాళ్ళు చుట్టుముట్టిన ప‌రిస్థితుల్లో త‌ల్లికి చేయూతను ఇవ్వడానికి రాజ‌కీయాల్లో చేర‌వ‌ల‌సిందిగా రాజీవ్‌గాంధీపై వ‌త్తిడి పెరిగింది. తర్వాత వత్తిడికి తలవొగ్గక తప్పలేదు. త‌మ్ముని మృతి కార‌ణంగా ఉత్తరప్రదేశ్‌ లోని అమేథీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లో రాజీవ్‌గాంధీ గెలుపొందారు. ఆ త‌రువాత కాలంలో అనేక ప‌రీక్షా స‌మ‌యాల్లో రాజీవ్‌గాంధీ శ‌క్తి సామ‌ర్థ్యాలు, ప్రజ్ఞాపాట‌వాలు బయటపడ్డాయి. 1984 అక్టోబ‌ర్ 31న త‌ల్లి ఇందిరాగాంధీ దారుణ హ‌త్యకు గురైన స‌మ‌యంలో ప్రధాన‌మంత్రిగాను, కాంగ్రెస్ అధ్యక్షునిగాను ఆయ‌న విధులు నిర్వర్తించాల్సి వ‌చ్చింది. వ్యక్తిగ‌త దుఃఖాన్ని, విచారాన్ని అణ‌చుకొని జాతీయ బాధ్యత‌ను ఎంతో హుందాగా, ఓర్పుగా త‌న భుజాల‌కు ఎత్తుకున్నారు.

నెల రోజుల‌పాటు నిర్వహించిన ఎన్నిక‌ల ప్రచారంలో రాజీవ్‌గాంధీ దేశంలోని ఒక ప్రాంతం నుంచి మ‌రొక ప్రాంతానికి అలుపు అల‌స‌ట లేకుండా ప్ర‌యాణించారు. అనేక‌చోట్ల 250 స‌భ‌ల్లో మాట్లాడారు. కోట్లాది మంది ప్రజ‌ల‌తో ముఖాముఖి జ‌రిపారు. రాజీవ్‌గాంధీ అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞాన ప్రపంచంలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. త‌న ప్రధాన ఆశ‌యాల‌లో భార‌త ఐక్యత‌ను ప‌రిర‌క్షిస్తూనే దేశాన్ని 21వ శ‌తాబ్దంలోకి తీసుకువెళ్ళడం ముఖ్యమైన‌ద‌ని రాజీవ్ ప‌దేప‌దే చెబుతూండేవారు.ఆయన తెచ్చిన సంస్కరణలు దేశ గతిని మార్చాయని చెప్పాలి.

రాజీవ్ హత్యకేసులో కీలక తీర్పు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో సంచలన తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు.. ఆ కేసులో దోషిగా ఉన్న పేరారివాలన్ 31 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు. రాజీవ్ గాంధీ హత్యకేసులో 31 ఏళ్లుగా జైలు జీవితం గడిపిన యావజ్జీవ ఖైదీల్లో ఒకరైన ఏజీ పెరారివాలన్‌ను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. 1998లో పేరారివాలన్‌కు ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణశిక్ష విధించింది. మరుసటి సంవత్సరం, సుప్రీంకోర్టు ఆ శిక్షను సమర్థించింది.. కానీ, 2014లో దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. అయితే, ఈ ఏడాది మార్చిలో, ఉన్నత న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. కొంతకాలం తర్వాత, పెరారివాలన్ జైలు నుంచి త్వరగా విడుదల చేయాలని కోరుతూ విజ్ఞప్తి చేసినా.. అతడి అభ్యర్థనను కేంద్రం వ్యతిరేకించింది, తమిళనాడు గవర్నర్ ఈ విషయాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ దృష్టికి తీసుకెళ్లారు.. కానీ, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. అయితే, ఈ వ్యవహారంలో జాప్యాన్ని, గవర్నర్ చర్యను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగంలోని సెక్షన్ 161 ప్రకారం క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఏడుగురు దోషులను విడుదల చేయాలన్న కేబినెట్‌ నిర్ణయానికి తమిళనాడు గవర్నర్ కట్టుబడి ఉన్నారని, దాంతో రాష్ట్రపతి స్పందన కోసం వేచి ఉండబోమని కోర్టు స్పష్టం చేసింది.. గత వారం విచారణలో, క్షమాపణ మంజూరు చేసే కేసులలో, రాష్ట్రపతికి మాత్రమే ప్రత్యేక అధికారాలు ఉంటాయన్న కేంద్రం వాదనలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

కాగా, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని మే 21, 1991న తమిళనాడులోని శ్రీపెరంబుదూర్‌లో ఎన్నికల ర్యాలీలో ధను అనే మహిళ ఆత్మాహుతి దాడి చేసి హత్య చేసింది. ఈ కేసులో ఏడుగురికి శిక్ష పడింది. అందరికీ మరణశిక్ష విధించబడినప్పటికీ, 2014లో, వారి క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో రాష్ట్రపతి తీవ్ర జాప్యం చేశారని పేర్కొంటూ సుప్రీంకోర్టు వారిని జీవిత ఖైదులకు మార్చింది. వారిలో ఒకరైన నళిని శ్రీహరన్ జైలు శిక్షను 2000లో రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ జోక్యంతో మార్చారు, ఎందుకంటే ఆ మహిళ జైలులో ఉన్నప్పుడు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇక, జయలలిత, పళనిసామి నేతృత్వంలోని తమిళనాడు మంత్రివర్గం 2016, 2018లో దోషులను విడుదల చేయాలని సిఫారసు చేసినప్పటికీ, వరుసగా వచ్చిన గవర్నర్లు దానిని పట్టించుకోలేదు. చాలా ఆలస్యం తర్వాత వారు దానిని రాష్ట్రపతికి పంపించారు..

ఇక, పెరారివాలన్, ఇతరులు 16 ఏళ్లు దాటిన తర్వాత కూడా ఇతర దోషుల మాదిరిగానే వారికి ఉపశమనం లభించకపోవడంతో కోర్టులను ఆశ్రయించారు. వారు ఇప్పుడు మూడు దశాబ్దాలు జైలు జీవితం గడిపారు. చాలా ఏళ్ల పాటు ఏకాంత ఖైదులో ఉన్న పెరారివాలన్ జైలులో చాలా మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు. సుదీర్ఘ ఖైదు సమయంలో అతను అనేక విద్యా అర్హతలను సంపాదించాడు. అతను ఒక పుస్తకాన్ని కూడా రచించాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో త్వరలోనే విడుదల అవుతున్నారు.

Exit mobile version