NTV Telugu Site icon

Supreme Court: తెల్లవారుజామున ఘటన, రాత్రి 11.30 గంటలకు ఎఫ్ఐఆర్.? కోల్‌కతా వైద్యురాలి ఘటనపై సుప్రీం సీరియస్..

Supreme Court

Supreme Court

Supreme Court: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ రోజు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్‌లు జేబీ పార్దివాలా, మనోజ్‌ మిశ్రాల త్రిసభ్య ధర్మాసనం విచారిస్తోంది. ఈ కేసులో ఆర్‌జి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జరిగిన 31 ఏళ్ల పీజీ ట్రైనీ డాక్టర్‌పై ఆగస్టు 9న దారుణమైన అత్యాచారం జరిగింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలను రెకెత్తించింది. ‘‘పాతుకుపోయిన పితృస్వామ్య పక్షపాతం కారణంగా మహిళా వైద్యులు ఎక్కువగా లక్ష్యమవుతున్నారు. వైద్యవృత్తులు హింసకు గురవుతున్నాయి. ఎక్కువ మంది మహిళలు వర్క్‌ఫోర్స్‌లో చేరినందున, పరిస్థితులు మారడం కోసం దేశం మరొక అత్యాచారం కోసం వేచి ఉండదు’’ అని చంద్రచూడ్ అన్నారు.

అయితే, ఈ కేసులో బెంగాల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఆలస్యం చేయడంపై, కేసుని నిర్వహించడంతో నిర్లక్ష్యం, లోపాలపై బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ప్రభుత్వం, ఆస్పత్రి అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ పోలీసుల చర్యలకు సంబంధించి అనేక ముఖ్యమైన ప్రశ్నల్ని లేవనెత్తారు. మృతదేహానికి దహన సంస్కారాలకు అప్పగించిన మూడు గంటల తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు..? అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

Read Also: Hanuman In USA: వావ్.. అమెరికాలో 90 అడుగుల ఎత్తైన హనుమాన్ విగ్రహ ప్రతిష్ట..

‘‘ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నాడు..? ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు.?? మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు, పోలీసుల ఏం చేస్తున్నారు..? తీవ్రమైన నేరం జరిగింది, క్రైమ్ సీన్ హస్పిటల్‌లో ఉంది.. వారు ఏం చేస్తున్నారు..? విధ్వంసకులను ఆస్పత్రిలోకి ప్రవేశిస్తారా..? అని చంద్రచూడ్ బెంగాల్ ప్రభుత్వం, పోలీసులను ప్రశ్నించారు. బెంచ్ ప్రశ్నలకు న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. హాస్పిటల్ వ్యక్తులు ఫోటోలు తీశారని, అసహజ మరణానికి సంబంధించిన కేసు వెంటనే ప్రారంభించారని చెప్పారు. ముఖ్యంగా బాధితురాలి తల్లిదండ్రులు గైర్హాజరైనప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆస్పత్రి ప్రధాన విధి అని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు.

జస్టిస్ పార్దీవాలా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సమయం గురించి ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన మొదటి ఇన్‌ఫార్మర్ ఎవరు..? ఎఫ్ఐఆర్ నమోదైన టైమ్ ఎంత..?, అని ప్రశ్నించారు. బాధితురాలి తండ్రి అని, అతను రాత్రి 11.45 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరుపున వాదిస్తున్న సిబల్ చెప్పారు. రాత్రి 8.30 గంటలకు బాధితురాలి మృతదేహానికి దహన సంస్కారాలు చేసిన 3 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 1.45 నుంచి 4.00 గంటల మధ్య పోస్టుమార్టం నివేదిక హత్య అని తేల్చింది. అయితే, ఎఫ్ఐఆర్ ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించారు. ఆ సమయంలో కాలేజ్ ప్రిన్సిపాల్, ఆస్పత్రి బోర్డు ఏం చేస్తున్నారు..? అని సీజేఐ ప్రశ్నించారు.

బాధితురాలి పేరు, ఫోటోలు మీడియాలో రావడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. చాలా మంది యువవైద్యులు 36 గంటలు పనిచేస్తున్నారని, సురక్షితమైన పని పరిస్థితులను నిర్ధారించడానికి మేము జాతీయ ప్రోటోకాల్‌ని రూపొందించాలని కోర్టు పేర్కొంది. నేరం తెల్లవారుజామున జరిగితే దానిని ఆత్మహత్యగా మార్చడానికి ప్రిన్సిపాల్ ప్రయత్నించాడని కోర్టు పేర్కొంది. మరోవైపు ఘటన సమయంలో ప్రిన్సిపాల్‌గా ఉన్న సందీప్ ఘోష్‌ని సీబీఐ మూడు రోజలుగా ప్రశ్నిస్తోంది. ఘటన సమయంలో ప్రిన్సిపాల్ ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీకి రాజీనామా చేసిన తర్వాత, కలకత్తా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా నియమమించడం ఏంటని ప్రశ్నించింది.