NTV Telugu Site icon

Narendra Modi: ఆర్టికల్ 370పై సుప్రీం తీర్పు.. మోడీ స్పందన

Narendra Modi

Narendra Modi

‘ఆర్టికల్‌ 370’పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమైనదని కొనియాడుతూ సోమవారం ఆయన ట్వీట్ చేశారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్‌ రద్దుపై 2019, ఆగస్టు 5వ తేదీన భారత పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని చెప్పారు. సుప్రీం తీర్పు జమ్మూ కాశ్మీర్, లడఖ్‌ ప్రజల ఐక్యతను చాటి చెప్పిందన్నారు.

Also Read: Tammineni Sitaram: ఆర్కే ఎందుకు రాజీనామా చేశారో నాకు తెలియదు..

‘భారతీయులు గౌరవించే ఐక్యతా సారాంశాన్ని సుప్రీంకోర్టు బలపరిచింది. జమ్మూకశ్మీర్, లడఖ్‌లోని ప్రజల కలలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇస్తున్నాను. అభివృద్ధి ఫలాలు జమ్మూకాశ్మీర్ ప్రజలకు చేరడమే కాకుండా, ఆర్టికల్ 370 కారణంగా నష్టపోయిన అత్యంత బలహీన, అట్టడుగు వర్గాలకు వాటి ప్రయోజనాలను అందజేయాలని నిశ్చయించుకున్నాం. ఈరోజు తీర్పు కేవలం చట్టపరమైన తీర్పు మాత్రమే కాదు..ఇది ఆశాకిరణం. ఉజ్వల భవిష్యత్తుకోసం బలమైన, మరింత ఐక్యతాయుత భారతదేశాన్ని నిర్మించాలనే తమ సంకల్పానికి సుప్రీంకోర్టు తీర్పు నిదర్శనమని’ ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Also Read: Gutha Sukender Reddy: నేను పార్టీ మారడం లేదు.. క్లారిటీ ఇచ్చిన గుత్తా సుఖేందర్

కాగా జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ‘ఆర్టికల్‌ 370’ రద్దు రాజ్యాంగబద్ధమేనని పేర్కొంటూ భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 30లోపు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది.