NTV Telugu Site icon

Rajouri: రాజౌరి మిస్టరీ మరణాల వెనక విష పదార్థాలు.. బ్యాక్టీరియా, వైరస్‌ కాదు..

Rajouri

Rajouri

Rajouri: జమ్మూ కాశ్మీర్ రాజౌరీ జిల్లాలో మిస్టరీ మరణాలు కలవరపెడుతున్నాయి. గత నెల రోజులుగా 17 మంది ప్రాణాలను బలిగొన్న ఈ మిస్టరీకి బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్లు కారణం కాదని కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారం చెప్పారు. మిస్టరీ ఇన్ఫెక్షన్ వల్లే మరణాలు సంభవిస్తున్నాయనే వాదనని ఆయన తోసిపుచ్చారు. డిసెంబర్ 7 నుండి జనవరి 19 వరకు జరిగిన ఈ మరణాలు రాజౌరిలోని మారుమూల బాధాల్ గ్రామంలోని మూడు కుటుంబాలలో సంభవించాయి.

Read Also: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు కాసుల వర్షం

ఈ మరణాలకు బ్యాక్టీరియా, వైరస్ కాదని పరీక్షల్లో తేలింది. అయితే, కొన్ని విషపూరిత పదార్థాలను గుర్తించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఇవి ఏమిటనేది నిర్ధారించేందుకు దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఏదైనా కుట్ర ఉందని తెలిస్తే చర్యలు తీసుకుంటాని మంత్రి హామీ ఇచ్చారు. బుధవారం నుంచి బాధిత గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సమావేశాలను నిషేధించారు. మరణించిన కుటుంబాల దగ్గరి బంధువులు, మరో నలుగురు గ్రామస్తుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అనుమానాస్పద మరణాలను పరిశోధించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 11 మంది సభ్యుల అంతర్-మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేసింది. జ్వరం, నొప్పి, వికారం, తీవ్రమైన చెమట, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలను రోగులు నివేదించారు. తరచుగా ఆసుపత్రిలో చేరిన కొన్ని రోజుల్లోనే మరణానికి సంభవించాయి. బాధిత కుటుంబాల ఇళ్లలోని ఆహార పదార్థాలను అధికారం స్వాధీనం చేసుకుని పరీక్షించాలని ప్రభుత్వం అధికారుల్ని ఆదేశించింది.