Site icon NTV Telugu

Harsh Vardhan: ‘‘నా క్లినిక్ నా కోసం ఎదురుచూస్తోంది’’.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన బీజేపీ నేత..

Harsh Vardhan

Harsh Vardhan

Harsh Vardhan: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ కీలక నేత డాక్టర్ హర్ష వర్ధన్ తన మూడు దశాబ్ధాల రాజకీయ ప్రస్థానాన్ని ముగించారు. నిన్న బీజేపీ విడుదల చేసిన 195 ఎంపీ అభ్యర్థుల జాబితాలో హర్ష్ వర్ధన్ పేరు లేదు. ప్రస్తుతం ఢిల్లీ చాందినీ చౌక్ నుంచి ఎంపీగా ఉన్న ఆయన స్థానాన్ని ప్రవీణ్ ఖండేల్ వాల్‌కి కేటాయించారు. బీజేపీ సైద్ధాంతిక గురువు ఆర్ఎస్ఎస్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన 69 ఏళ్ల హర్ష్ వర్ధన్ నేనెప్పుడూ స్వయం సేవక్‌నే అంటూ ‘‘హృదయంలో స్వయంసేవక్’’ అని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ఒత్తిడితో రాజకీయాల్లో వచ్చిన ఆయన ప్రస్తుతం తప్పుకున్నారు.

పూర్తి కాలం తన వైద్యవృత్తిని కొనసాగించేందుకు తిరిగి వస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తన పదవీకాలంలో సాధించిన విజయాలను ఆయన గుర్తు చేసుకున్నారు. అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్రమోడీకి, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ ముప్పై ఏళ్లుగా అద్భుతమైన కెరీర్ సాగించాను, ఐదు సార్లు అసెంబ్లీకి, రెండు సార్లు ఎంపీగా ఎన్నికల్లో గెలిచాను, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో ప్రతిష్టాత్మక పదవుల్ని నిర్వహించాను. ఇప్పుడు నా మూలాల్లోకి తిరిగి రావడానికి వేచి చూస్తున్నా, నా ఈఎన్‌టీ క్లీనిక్ నా పునరాగమనం కోసం ఎదురుచూస్తోంది’’ అంటూ హర్ష్ వర్థన్ ట్వీట్ చేశారు.

Read Also: PM Modi: దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ పర్యటన.. 10 రోజుల్లో 12 రాష్ట్రాల్లో కార్యక్రమాలు..

ఎక్స్ వేదికగా ఆయన సుదీర్ఘ వీడ్కోలు సందేశాన్ని పంచుకున్నారు. ‘‘పొగాకు, మాదకద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా, సరలమైన మరియు సుస్థిరమైన జీవనశైలిని బోధించడానికి’’ తన పనిని కొనసాగిస్తానని ట్వీట్ చేశారు. ముగ్గురు ప్రధాన శత్రువులు – పేదరికం, అనారోగ్యం మరియు అజ్ఞానంతో పోరాడే అవకాశం కోసం వారు తనకు రాజకీయాల్లోకి రావడానికి ఒప్పించారని అన్నారు. డాక్టర్ హర్ష్ వర్థన్ జూలై 2021 కేబినెట్ పునర్వ్యవస్తీకరణకు ముందు కేంద్ర ఆరోగ్యమంత్రిగా పనిచేశారు. ఆయన స్థానంలో మన్సుఖ్ మాండవీయ ఈ బాధ్యతల్ని చేపట్టారు. కోవిడ్ సమయంలో కేంద్రం విఫలం కావడంతోనే ఆయన్ను తొలగించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఢిల్లీలో నలుగురు సిట్టింగ్ ఎంపీలను బీజేపీ మార్చింది. పర్వేశ్ వర్మ, రమేష్ బిధూరి, మీనాక్షి లేఖి, హర్ష్ వర్థన్ స్థానాల్లో వేరే వారిని ప్రకటించింది.

Exit mobile version