NTV Telugu Site icon

Maharashtra: ఎంవీఏ కూటమికి బీటలు.. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని శివసేన(యూబీటీ) నిర్ణయం

Mvaunity

Mvaunity

ఇండియా కూటమి దాదాపుగా చీలిపోయినట్లుగానే తెలుస్తోంది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమి పరిస్థితి మరింత దిగజారింది. ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా నేతలు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే దేశ రాజధానిలో ఆప్-కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తోంది. తాజాగా బీహార్‌లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. ఇండియా కూటమి కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే ఏర్పడిందని.. ఇప్పుడు దాని అవసరం లేదని వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు రెడీగా ఉండాలని సూచించారు. అలాగే జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇండియా కూటమి లోక్‌‌సభ ఎన్నికల కోసమేనని పేర్కొన్నారు.

తాజాగా మహారాష్ట్రలో అదే పరిస్థితి దాపురించింది. మహారాష్ట్రలో నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఘోరంగా వైఫల్యం చెందింది. దీంతో కూటమిలో చీలకలు మొదలయ్యాయి. లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో ఈ కూటమి మంచి ఫలితాలనే సాధించింది. 6 నెలలు తిరిగే సరికి అంతా రివర్స్ అయింది. అంచనాలన్నీ తారుమారు అయ్యాయి. ప్రస్తుతం మహా వికాస్ అఘాడీ కూటమిలోని నేతల మధ్య పొసగడం లేదు. దీంతో కూటమి చీలిక దిశగా వెళ్తోంది.

ముంబై, నాగ్‌పూర్, థానేలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో శివసేన (యుూబీటీ) ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుందని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ శనివారం మీడియాకు వెల్లడించారు. దీంతో ఎంవీఏ ఐక్యతపై ప్రశ్నార్థకంగా మారింది. కూటమి కారణంగా పార్టీ కార్యకర్తలకు అవకాశాలు ఉండడం లేదని. సంస్థాగతంగా కూడా పరిస్థితులు బాగోలేదని.. అందుకే ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ముంబై, థానే, నాగ్‌పూర్, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌లు, పంచాయతీ ఎన్నికల్లోనూ స్వతంత్రంగా పోటీ చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లాలని ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి సంకేతాలు ఇచ్చారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని.. ఓటమి తర్వాత కనీసం సమీక్ష చేసుకునేందుకు ఒక్క సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. దీంతో కూటమిలో నిరాశ, నిస్పృహలు ఏర్పడినట్లు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా కాంగ్రెస్ ఒంటరి అయింది. మిత్ర పక్షాలు సపోర్టు చేయలేదు. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో కూడా కూటమి ఐక్యతగా లేదు. దీంతో దాదాపు కూటమి చీలిపోయినట్లుగానే వార్తలు వినిపిస్తున్నాయి.

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మహాయుతి కూటమి 230 స్థానాలు గెలుచుకుంది. ఎంవీఏ కేవలం 46 స్థానాలతో సరిపెట్టుకుంది. శివసేన (యూబీటీ) 20,, కాంగ్రెస్ 20, ఎన్‌సీపీ (ఎస్‌పీ) 10 స్థానాలు గెలుచుకున్నాయి.

Show comments