NTV Telugu Site icon

Devendra Fadnavis: నెహ్రూ, కాంగ్రెస్ ఎన్నడూ శివాజీ మహారాజ్‌ని గౌరవించలేదు..

Devendra Fadnavis

Devendra Fadnavis

Devendra Fadnavis: మహారాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం శివాజీ మహారాజ్ విగ్రహం చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల సింధుదుర్గ్ జిల్లాలో శివాజీ విగ్రహం కూలిపోవడంపై ఏక్‌నాథ్ షిండే-బీజేపీ-ఎన్సీపీ(అజిత్ పవార్)ల సర్కార్ ‘మహాయుతి’పై విపక్ష కూటమి మహావికాస్ అఘాడీ( కాంగ్రెస్- ఉద్ధవ్ ఠాక్రే- ఎన్సీపీ శరద్ పవార్)ల కూటమి విరుచుకుపడుతోంది. ఈ రోజు ఎంవీఏ కూటమి ఆందోళనలకు పిలుపునిచ్చింది. విగ్రహం కూలిపోవడంపై ప్రభుత్వాన్ని నిందిస్తోంది.

ఇదిలా ఉంటే, ప్రతిపక్ష పార్టీల రాజకీయాలపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కానీ ఎంవీఏ నాయకులు ఎన్నడూ శివాజీ మహారాజ్‌‌ని గౌరవించలేదని అన్నారు. ఈ ఆందోళనలు పూర్తిగా రాజకీయమని నెహ్రూ జీ ఛత్రపతి శివాజీ మహారాజ్‌ని డిస్కవరీ ఆఫ్ ఇండియాలో అవమానించారని ఎత్తిచూపారు. కాంగ్రెస్, ఎంవీఏ దీనికి క్షమాపణలు చెబుతాయా..? అని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సీఎం కమల్ నాథ్ శివాజీ విగ్రహాన్ని బుల్డోజర్లతో కూల్చేశారని, స్వతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ శివజీ సూరత్‌ని దోచుకున్నారని బోధించారని, వీటికి కాంగ్రెస్ క్షమాపణలు చెబుతుందా..? అని అడిగారు.

Read Also: Crime: 13 ఏళ్ల బాలికపై స్కూల్ ప్యూన్ అత్యాచారం.. గర్భం దాల్చడంతో వెలుగులోకి దారుణం..

ఈ ఘటనను రాజకీయం చేయడం సరికాదని ఎన్సీపీ(అజిత్ పవార్) ప్రధాన కార్యదర్శి, ఎంపీ సునీల్ తట్కరే ఫడ్నవీస్‌కి మద్దతు తెలిపారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమని, మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) దీన్ని రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు ఈ ఘటనకు క్షమాపణలు చెప్పారు. కాబట్టి దీనిని రాజకీయం చేయడం మానుకోవాలని హితవు చెప్పారు.

ఎంపీఏ కూటమి ఆందోళనల నేపథ్యంలో ముంబై పోలీసులు మరింత సిబ్బందిని మోహరించారు. ఎంవీఏ నేతల మార్చ్ చర్చ్‌గేట్ స్టేషన్ సమీపంలోని హుటాత్మా చౌక్ నుంచి ప్రారంభమై గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద ముగుస్తుంది. ఆగస్టు 26న సింధుదుర్గ్ జిల్లాలోని శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోవడంతో ఈ అంశం రాజకీయంగా మారింది. కొద్ది నెలల క్రితమే ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించారు. విగ్రహం కూలిపోయిన అంశంపై ప్రధాని నరేంద్రమోడీ క్షమాపణలు చెప్పారు.