మహారాష్ట్రలో ఇండియా కూటమిలో సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు శివసేన(యూబీటీ) నేతలు తెలిపారు. సీట్ల పంపకాలపై ఇండియా కూటమిలో విభేదాలు వచ్చినట్లు వార్తలు వినిపించాయి. శివసేన(యూబీటీ) ఒంటరిగా పోటీ చేస్తుందని వార్తలు షికార్లు చేశాయి. వదంతులకు ఫుల్‌స్టాప్ పెడుతూ సంజయ్ రౌత్ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్‌తో సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు పేర్కొన్నారు.
శివసేన-కాంగ్రెస్ 210 సీట్లలో ఎంవీఏ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు గాను 210 స్థానాల్లో పోటీపై ప్రతిపక్ష పార్టీల మహా వికాస్ అఘాడి ఏకాభిప్రాయానికి వచ్చింది. ఈ పురోగతి ముఖ్యమైన విజయంగా పేర్కొంటూ శివసేన (యుూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ప్రకటించారు. మహారాష్ట్రను దోచుకుంటున్న శక్తులను ఓడించడమే ఇండియా కూటమి లక్ష్యమని అన్నారు.
‘‘210 సీట్లపై ఏకాభిప్రాయానికి వచ్చాం. ఇది ఒక ముఖ్యమైన విజయం. ఉమ్మడి శక్తిగా ఎన్నికల్లో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మహారాష్ట్రను లూటీ చేసే శక్తులను ఓడిస్తాము.’’ అని రాజ్యసభ ఎంపీ, శివసేనకు కీలక వ్యూహకర్త రౌత్ విలేకరులతో అన్నారు. ఎంవీఏలో శివసేన (UBT), NCP (శరద్ పవార్) మరియు కాంగ్రెస్ ఉన్నాయి. మరోవైపు పాలక మహాయుతిలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శివసేన, బీజేపీ, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీల కూటమి ఉంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనున్నాయి. నవంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 26తో ముగుస్తుంది. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమిలు తలపడుతున్నాయి. నువ్వానేనా? అన్నట్టుగా అభ్యర్థులను బరిలోకి దింపుతున్నారు. విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.