Site icon NTV Telugu

Bihar Hijab Controversy: హిజాబ్ వైద్యురాలికి బంపర్ ఆఫర్.. 3లక్షల జీతం.. కోరుకున్న ఉద్యోగం.. ఎక్కడంటే..!

Bihar

Bihar

బీహార్‌లో హిజాబ్ వ్యవహారరం తీవ్ర దుమారం రేపింది. డిసెంబర్ 15న పాట్నాలో వైద్యులకు నియామక పత్రాలు అందజేస్తుండగా ఒక ముస్లిం వైద్యురాలి హిజాబ్‌ను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తొలగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోశాయి. నితీష్ కుమార్ మానసిక స్థితి బాగోలేదని ఆర్జేడీ ఆరోపించారు. ఇక పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్ అయితే క్షమాపణ చెప్పకపోతే చంపేస్తానంటూ నితీష్‌కుమార్‌కు వార్నింగ్ ఇచ్చారు.

తాజాగా హిజాబ్ బాధిత వైద్యురాలు నుస్రత్ పర్వీన్‌కు జార్ఖండ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. జార్ఖండ్‌లో మంచి ఉద్యోగం ఇస్తామని ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ప్రకటించారు. హెల్త్ సర్వీసులో నెలకు రూ.3 లక్షల జీతం, నచ్చిన పోస్టింగ్, ప్రభుత్వ వసతి, పూర్తి భద్రతతో కూడిన ఉద్యోగం ఇస్తామని మంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోనే ఉద్యోగ నియామకం జరుగుతుందని వెల్లడించారు. గౌరవంతో పాటు భద్రత హామీ ఇస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

బీహార్‌లో వైద్యురాలి విషయంలో అసభ్యకరమైన, అమానవీయమైన, హృదయ విదారక సంఘటన యావత్తు దేశ మనస్సాక్షిని బాధపరించిందన్నారు. హిజాబ్‌ను లాగడం అవమానకరమైన చర్యగా పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంపై జరుగుతున్న దాడికి తెలిపారు. తాను కూడా మొదట వైద్యుడినేనని.. తర్వాతే మంత్రిని అయినట్లు చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అవమానించడంతో వైద్యురాలు ఉద్యోగంలో చేరడం మానేసిందని కథనాలు వెలువడుతున్నాయి. లేదు.. లేదు ఆమె ఉద్యోగంలో చేరుతుందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఆమె ఉద్యోగంలో చేరడానికి నిరాకరించడంతోనే జార్ఖండ్ ప్రభుత్వం ఉద్యోగ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే..
కొత్తగా నియమితులైన ఆయుష్ వైద్యుల నియామక పత్రాల అందజేత కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా, మంత్రులు విజయ్ కుమార్ చౌదరి, మంగళ్ పాండే పాల్గొన్నారు. వేదికపైన నియామక పత్రాలు అందజేస్తుండగా ఒక ముస్లిం వైద్యురాలు హిజాబ్ ధరించుకుని వచ్చింది. నితీష్ కుమార్ పత్రాన్ని అందజేసే క్రమంలో వైద్యురాలి హిజాబ్‌ను తొలగించాలని కోరారు. కానీ అంతలోనే ఆమె హిజాబ్‌ను కిందకు గట్టిగా లాగే ప్రయత్నం చేశారు. ఈ హఠాత్తు పరిణామంతో వైద్యురాలు షాక్‌కు గురైంది. అంతేకాకుండా వేదిక దగ్గర ఉన్న నాయకులు, అధికారులు కూడా ఆశ్చర్యపోవడం వంతైంది.

Exit mobile version