Ramtek bungalow: మహారాష్ట్రలో బీజేపీ, ఎన్సీపీ అజిత్ పవార్, శివసేన ఏక్‌నాథ్ షిండేల ‘‘మహాయుతి’’ ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు పదవీ బాధ్యతలు తీసుకున్నారు. మరోవైపు మంత్రులు నియామకం కూడా జరిగింది. ప్రస్తుతం మంత్రులకు బంగ్లాలు కేటాయించే పని జరుగుతోంది. అయితే, మంత్రులు మాత్రం ఒక్క బంగ్లా అంటే మాత్రం విపరీతంగా భయపడుతున్నారు. ఆ బంగ్లా తమకు వద్దు అంటూ వెనక్కి తగ్గుతున్నారు.
‘‘రామ్‌టెక్ బంగ్లా’’ ముంబైలోని మలబార్ హిల్‌లోని ఈ బంగ్లాను ఎవరూ కోరుకోవడం లేదు. విలాసవంతమైన ఈ బంగ్లాను అత్యంత దురదృష్టకరమైన బంగ్లాగా పేరొందింది. అయితే, ప్రస్తుతం ఈ బంగ్లాను మహారాష్ట్ర రెవెన్యూ మినిస్టర్, మహారాష్ట్ర బీజేపీ చీఫ్ అయిన చంద్రశేఖర్ బవాన్‌కులేకి కేటాయించారు. ఆయన కూడా ఇందులోకి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. రామ్‌టెక్ బంగ్లాను తనకు కేటాయించిన బంగ్లాకు మార్చుకునేందుకు బవాన్‌కులే సహచర క్యాబినెట్ మంత్రి పంకజా ముండేతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
నిజానికి ఈ బంగ్లాలో నివసించిన మంత్రులు ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం, అవినీతి ఆరోపణలు, పదవులు కోల్పోవడం జరిగింది. కానీ, పంకజా ముండేకి మాత్రం ఈ బంగ్లాతో భావోద్వేగ సంబంధం ఉంది. ఆమె తండ్రి దివంగత గోపీనాథ్ ముండే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడే నివసించారు.
Read Also: CM Revanth Reddy: అదానీ పెట్టుబడుల ఒప్పందాలను వెంటనే రద్దు చేయలేం..
మంత్రులకు బంగ్లా అంటే భయం ఎందుకు..?
ఛగన్ భుజ్‌బల్(ఎన్సీపీ): కాంగ్రెస్-ఎన్‌సిపి సంకీర్ణ ప్రభుత్వ హయాంలో, భుజ్‌బల్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో రామ్‌టెక్ బంగ్లాలోనే నివసించారు. 2003 తెల్గీ స్టాంప్ పేపర్ స్కామ్‌లో ఈయన పేరు బయటకు రావడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఏక్‌నాథ్ ఖడ్సే (ఎన్‌సిపి): బిజెపి-శివసేన ప్రభుత్వ హయాంలో 2014 నుండి 2016 వరకు వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. ఈయనపై కూడా అవినీతి ఆరోపణలు రావడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఛగన్ భుజ్‌బల్ (NCP): 2019లో మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వంలో ఆహారం మరియు పౌర సరఫరాల మంత్రిగా మరోసారి ఈ బంగ్లాలోనే ఉన్నారు. రెండున్నరేళ్లలో ప్రభుత్వం పడిపోవడంతో పదవి కోల్పోయారు.
దీపక్ కేసర్కర్ (షిండే సేన): గతంలో పాఠశాల విద్య, మరాఠీ భాషా మంత్రిగా పనిచేసిన కేసర్కర్ కూడా బంగ్లా బాధితుల్లో ఉన్నారు. ఇటీవల మహాయుతి కూటమి విజయం సాధించినా, ఫడ్నవీస్ క్యాబినెట్‌లో మంత్రి పదవి దక్కలేదు.